సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేయండి
1 min read– జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ వై. చంద్రచూడ్ ఈ నెల 25, 26 తేదీలలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం శ్రీశైలం విచ్చేస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీశైల పర్యటన కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతిలతో కలిసి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 25, 26 తేదీలలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం శ్రీశైలం విచ్చేస్తున్న సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సున్నిపెంట హెలిప్యాడ్ మైదానాన్ని సిద్ధం చేసి చుట్టూ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలని ఆర్ అండ్ బి, అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించారు. కాన్వాయ్ వెంట 12 మంచి కండిషన్ గల వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. భ్రమరాంబా అతిథిగృహంలో ప్రోటోకాల్ ప్రకారం అల్పాహారం, తేనీరు, భోజనం తదితర ఏర్పాట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.హెలిప్యాడ్ సమీపంలో మెడికల్ క్యాంప్, అంబులెన్స్ తో పాటు డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని డిఎం అండ్ హెచ్.ఓ, డిసిహెచ్ ఎస్, నంద్యాల సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డ్యూటీ పాసులు మంజూరు చేయాలని ఆత్మకూరు ఆర్డిఓను కలెక్టర్ ఆదేశించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ జిల్లాల జడ్జిలు శ్రీశైలం వస్తున్న సందర్భంగా హెలిపాడ్ మొదలుకొని.. భ్రమరాంబ అతిథి గృహం, శ్రీశైలం దేవస్థానము తదితర ప్రదేశాలలో ముమ్మర పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిపిఓ, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓను ఆదేశించారు. హెలిప్యాడ్ సమీపంలో విఐపిలకు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈని ఆదేశించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాలకు, డ్యూటీ అధికారులకు ఆహారపదార్థాల పాకెట్లను అందజేయాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, నంద్యాల,డోన్,ఆత్మకూరు ఆర్డీఓలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, ఎం. దాసు, సంబందిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.