76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయండి
1 min readజిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో ఈనెల 26వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాల మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దడంతో పాటు జాతీయ పతాక ఆవిష్కరణ, పరేడ్ మార్చ్ ఫాస్ట్ లో సాయుధ దళాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి కేడెట్లు, స్కౌట్లు తదితర కంటిజెంట్స్ అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వేదిక, విఐపిలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు కూర్చునేందుకు ఎండ తగలకుండా పెండాల్స్ సీటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు శాఖలకు రోలింగ్ షీట్ లు బహుకరిస్తామన్నారు.దేశభక్తి ఉట్టిపడేలా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులచే తక్కువ నిడివి గల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిఇఓను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింభించేలా వ్యవసాయం, డిఆర్డిఏ, హౌసింగ్, వైద్యం, డ్వామా, వ్యవసాయ అనుబంధ రంగాలు తదితర అన్ని సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసి ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని ప్రదర్శించాలన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను ముందుగానే ప్రచురించి ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ముందుగానే పంపిణీ చేయాలని డిఆర్ఓను సూచించారు. గత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తలెత్తిన గ్యాప్ ను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వేడుకల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, సిపిఓ వేణుగోపాల్, ఆర్అండ్బి ఎస్ఇ శ్రీధర్ రెడ్డి, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, డ్వామా పీడీ జనార్దన్ రావు, డిఎంహెచ్ డా. వెంకటరమణ, డీఈఓ జనార్దన్ రెడ్డి, ఇతర జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.