గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
1 min read

అంగన్వాడి టీచర్ లకు సెల్ ఫోన్ ల పంపిణి కార్యక్రమం లో జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ.సిరి.
కర్నూలు , న్యూస్ నేడు : అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అంగన్వాడీ టీచర్లకు, సూపర్వైజర్లకు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం అందించిన శ్యాంసంగ్ 5జి సెల్ ఫోన్ లను పంపిణీ చేశారు.జిల్లా లో ఉన్న అంగన్వాడీ టీచర్ లు 1886 మందికి, సూపర్వైజర్ లు 73 మందికి, బ్లాక్ లెవెల్ లో 9 మంది కోఆర్డినేటర్ లకు కలెక్టర్ శాంసంగ్ 5జి సెల్ ఫోన్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల పోషణ, ఆరోగ్యం మెరుగుపడే విధంగా పనిచేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో స్థలం ఉన్న చోట కిచెన్ గార్డెన్ తయారు చేసి, ఆకు కూరలు పండించి, పిల్లలకు ఇచ్చే భోజనం తయారుచేయాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తీవ్రమైన పోషకాహార లోపం, మితమైన పోషకాహార లోపం గల పిల్లలను ఏవిధంగా గుర్తిస్తారు? వారి ఆరోగ్యం కొరకు ఏం చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించారు..పిల్లలకు మెనూ ప్రకారం పోషకాహారాన్ని అందించాలన్నారు.. పిల్లలు పరిశుభ్రం గా ఉండాలని, వారి ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ఎత్తులు , బరువులను పరిశీలించి, సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిడి విజయ మాట్లాడుతూ… జిల్లాలో 1978 మందికి శాంసంగ్ 5జి ఫోన్ లను ప్రభుత్వం అందించిందని, ఫోన్ లలో ఉన్న యాప్ లపై, ప్రతిరోజు వారు చేయవలసిన కార్యకలాపాలపై కూడా పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో ఐ.సి.డి.ఎస్ పి.డి. విజయ, సి.డి.పి.ఓ. అనురాధ , రాజేశ్వరి , సూపర్వైజర్ అనూష , కో ఆర్డినేటర్ బాలు , అంగన్వాడి టీచర్ లు పాల్గొన్నారు.

