మే 31 న చలో సిద్దేశ్వరంను విజయవంతం చేయండి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సిద్దేశ్వరం అలుగు సాధన కోసం జరిగే ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 9 వ వార్షికోత్సవం సందర్భంగా సంగమేశ్వరం దగ్గర మే 31 న జరిగే ప్రజా బహిరంగసభ విజయవంతానికై భాగంగా కొత్తపల్లి మండలంలోని పెద్ద గుమ్మడాపురం, ముసలిమడుగు, ఎదురుపాడు, యం.లింగాపురం, గోకవరం తదితర గ్రామాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ఇంకా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. రిజర్వాయర్ ఎగువన చేరిన మునక గ్రామాల ప్రజల త్రాగు, సాగునీటికై ఏర్పాటు చేస్తామన్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ఇప్పటి వరకు చేపట్టలేదనీ..ఇదేనా భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చే బహుమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబరు 98 ద్వారా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో కార్యాచరణ చేపట్టలేదని ఇది కాదా రాయలసీమ పట్ల పాలకుల వివక్షతకు నిదర్శనమని విమర్శించారు. ఉన్న ఎత్తిపోతల పథకాలకు నీరు అందాలంటే శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల నీరు వుండాలనీ…కానీ ప్రభుత్వం 854 అడుగుల కంటే దిగువకు నీటిని తోడేసి ఇక్కడి ప్రజలకు బురదను మిగుల్చుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రాయలసీమకు సాగునీటి హక్కులు ఉన్నప్పటికీ వాటిని కాపాడేందుకు సరియైన ప్రాజెక్టుల నిర్మాణాలను గాలికొదిలేసిన ప్రభుత్వం అమరావతిలో వేలకోట్లు ఖర్చుపెడుతూ రాయలసీమను ఎండగడ్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వేయి కోట్ల నిధులతో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే 60 tmc ల నీరు నిల్వ వుండి రాయలసీమలో త్రాగు, సాగునీటి కష్టాలను తీర్చవచ్చనీ రాయలసీమ సమాజం కోరుకుంటుంటే ప్రభుత్వం మాత్రం అమరావతి, పోలవరం మీదనే కేంద్రీకృతమై వుందని విమర్శించారు. ప్రజలందరూ తమ హక్కుల కోసం గళం విప్పాలనీ అందులో భాగంగా సంగమేశ్వరంలో మే 31 న జరిగే ప్రజా బహిరంగసభలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాలలో సమితి నాయకులు భాస్కర్ రెడ్డి, మనోజ్, విష్ణువర్ధన్ రెడ్డి, మూసా కలిముల్లా, అయ్యపురెడ్డి, చెన్నయ్య, శ్రీరాములు, సుబ్బరాయుడు, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.