PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి

1 min read

రౌండ్ టేబుల్ సమావేశంలో  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య ప్రజలకు పిలుపు

పల్లెవెలుగు వెబ్​ పత్తికొండ: ఈనెల 16న కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చాలు తలపెట్టిన గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక చదువుల రామయ్య భవనంలో ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పెద్ద ఈరన్న అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి సిపిఐ, తెదేపా, సిపిఎం, లోక్ సత్తా పార్టీల ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తూ, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్, అటవీ సంపదలను రవాణా, బ్యాంకులు, ఎల్ఐసి తదితర సంస్థలన్నింటిని కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమయ్యారని అన్నారు . కార్మిక చట్టాలను కాలరాసే విధంగా 44 కార్మిక చట్టాలను కేవలం 4 కోడ్ లుగా కుదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాస చర్యలు చేపట్టలేదని, రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోగా, తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు పూనుకోవడాన్ని వారు తప్పు పట్టారు. భూ హక్కుల చట్టం 27/23 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు. కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు. ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16 న తలపెట్టిన గ్రామీణ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మిక కర్షకులు, వ్యవసాయ కూలీలు, యువజన, విద్యార్థి సంఘాలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి. రాజా సాహెబ్. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్ కుమార్, లక్ష్మీనారాయణ, సిపిఎం నాయకులు వెంకటేశ్వర రెడ్డి, లోక్ సత్తా పార్టీ నాయకులు జయరాం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్, , తుగ్గలి, మద్దికేర మండలాల కార్యదర్శులు , సుల్తాన్, నాగరాజు, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు గురుదాస్, ఉమాపతి, కారన్న, నెట్టి కంటయ్య, పెద్దయ్య, హనుమేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author