ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దండి
1 min read
ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
రామనపల్లెలో స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ దివస్
చెన్నూరు, న్యూస్ నేడు: గ్రామపంచాయతీని ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆ దిశగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధ్యతాయుతంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు అన్నారు. మూడవ శనివారం మండలంలోని రామనపల్లె గ్రామపంచాయతీలో స్పెషల్ అధికారి అయిన ఎంఈఓ-2 సునీత సర్పంచ్ దీపం స్వప్నిక, గ్రామపంచాయతీ సిబ్బందితో ఆయన గ్రామంలో పర్యటించి ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత- ప్లాస్టిక్ వ్యర్థాలు, తడి చెత్త ,పొడి చెత్త, గురించి వివరించడం జరిగింది. అలాగే సేకరించిన చెత్తను ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాలలో ఏ విధంగా ఎరువులు తయారు చేస్తారు. దీని ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా ఉపయోగపడుతుంది. తద్వారా గ్రామ పంచాయతీకి ఏ విధంగా ఆదాయం సమకూరుతుందో సవివరంగా తెలియజేశారు. అంతేకాకుండా గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని, ఇంటి పరిసరాలలో గుంతలు ఏర్పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకంటే గుంతలలో వర్షపు నీరు నిలబడటంతో దోమలు ఉధృతంగా పెరగడం జరుగుతుందన్నారు. దీంతో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు వస్తాయని తెలిపారు. దీనిపై ప్రజలకు అధికారులందరూ కూడా అవగాహన కల్పించి తమ గ్రామ పరిసరాల పరిశుభ్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పై కూడా తెలియజేయాలని వారు తెలిపారు. అలాగే మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి ,కార్యదర్శి గురువేశ్వరరావు, ఈవోపీఆర్డి సురేష్ బాబు, ఏఎన్ఎంలు అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.