ఔషధాలు అందుబాటులో ఉంచండి: శ్రీశైలం ఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: నవంబరు 5 నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభమవుతున్నందున.. స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న. ఆదివారం కళ్యాణకట్ట, దేవస్థాన వైద్యశాలను ఆయన పరిశీలించారు. వైద్యశాలలోని ఓపి పేషేంట్ల వివరాల నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత ఈఓ మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్యకనుగుణంగా దేవస్థానం వైద్యశాలలో ఔషధాలను అందుబాటులో ఉంచాలని వైద్యవిభాగాన్ని ఆదేశించారు. ఎప్పటికప్పుడు వైద్యశాలకు అవసరమైన ఆయా ఔషధాల జాబితాను సంబంధిత అధికారులకు అందజేయాలని వైద్యులకు సూచించారు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నవారికి ఆలస్యం లేకుండా తక్షణ వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
తలనీలాల వద్ద.. కోవిడ్ నిబంధనలు పాటించండి..
దేవస్థానం వైద్యశాల కంటే ముందు.. కల్యాణ కట్టను పరిశీలించారు ఈఓ లవన్న. కల్యాణ కట్ట వద్ద తలనీలాలు తీసేసమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని, భక్తులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. పరిశీలనలో సహాయ కార్యనిర్వహణాధికారి నటరాజరావు, పారిశుద్ధ్య విభాగపు పర్యవేక్షకులు స్వాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.