నంద్యాల జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దండి
1 min read
వ్యసన విముక్తి కేంద్రం (డి అడిక్షన్ సెంటర్) ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: నవోదయం 2.0 కార్యక్రమం క్రింద నంద్యాల జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్ లో మద్య వ్యసనం వల్ల కలిగే దుష్ప్రభావాలు – నియంత్రణ పై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిఈఓ జనార్ధన్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపర్డెంట్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ నవోదయం 2.0 కార్యక్రమం క్రింద 129 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్ది సారా రహిత నంద్యాల జిల్లాగా తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు సారా వల్ల కలిగే అనర్ధాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా డోన్, బనగానపల్లి, ఆత్మకూరు మండలాల పరిధిలో 19 గ్రామాలు ఏ కేటగిరీగా, 19 గ్రామాలు బి కేటగిరీగా, మిగిలిన గ్రామాల్లో సారా విక్రయ కేంద్రాలు ఉన్నాయని… ఆయా గ్రామాల పరిధిలో సారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వ్యసన విముక్తి కేంద్రం (డి అడిక్షన్ సెంటర్) ను పూర్తి స్థాయి ఏర్పాటు చేసిన మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ జి.రాజకుమారి సూపర్డెంట్ ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యసనపరుల కోసం వ్యసన విముక్తి కేంద్రం (డి అడిక్షన్ సెంటర్) లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి కార్పొరేట్ స్థాయిలో సేవలందించాలని సూచించిందన్నారు. వ్యసన పరుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి పురుషుల కోసం ఐదు, స్త్రీల కోసం ఐదు బేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ట్రీట్మెంట్ కోసం నమోదయ్యే వారి పేర్లను గోప్యంగా ఉంచి వారికి వైద్యం అందజేస్తామనే భరోసాను కల్పించాలన్నారు. ప్రతి నెల రెండవ, నాలుగవ శనివారాల్లో మద్యం నివారణపై అవగాహన కల్పించాలన్నారు.నవోదయం కార్యక్రమం క్రింద అవగాహన కల్పించడం ద్వారా గడ్డిమేకలపల్లి గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దడం జరిగిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కలెక్టర్ కు నివేదించారు. డోన్ మండలంలోని అలెబాద్ తాండాలో పెద్ద ఎత్తున సారా తయారీ చేస్తున్నారని అక్కడి నుంచి సుమారు 10 ప్రాంతాలకు సరఫరా చేయడం జరుగుతుందని ఆ తాండా పై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కు వివరించారు.