అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజా స్వామికం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారన్న నెపంతో ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టులు, నిర్బంధానికి గురి చేయడం, ప్రజాస్వామిక చర్య అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ అన్నారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్, తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య లు ఉన్నారని, అలాగే జనసేన పార్టీ నాయకులను అరెస్టులో నిర్బంధాలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని వారన్నారు. మంగళవారం స్థానిక చదువులు రామయ్య భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాలన కాలంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాలో106 చెరువులకు నీళ్లు నింపాలన్నారు.పెండింగ్ ప్రాజెక్టుల కు నిధులు కేటాయించి తక్షణమే పూర్తి చేసి, సాగు, తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి సరైన వర్షాలు కురువక పోవడం వల్ల రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని, కర్నూలు జిల్లా ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. టమోటా పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ లో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ముందస్తు అరెస్టులు, నిర్బంధాలకు గురి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.