మరియమ్మ లాకప్ డెత్ కేసు.. ముగ్గురు పోలీసులపై వేటు
1 min readపల్ల వెలుగు వెబ్ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కు గురైన దళిత మహిళ మరియమ్మ కేసులో ముగ్గురు పోలీసులను విధుల నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లా కోమట్లగూడేనికి చెందిన మరియమ్మను జూన్ 18న రెండు లక్షల దొంగతనం కేసులో అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్, అతని స్నేహితుడు వేముల శంకర్ నుంచి 1.35లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బుకోసం మరియమ్మను పోలీస్ స్టేషన్ లో విచారణకు పిలిపించారు. విచారణ సమయంలో ఆమె స్పృహ కోల్పోవడంతో స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. తర్వాత భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. ఆమె మృతిచెందినట్టు వైద్యులు తేల్చారు. ఈ విషయంలో బయటికిరావడంతో కలకలం రేగింది.
పోలీసులు కొట్టడం వల్లే.. :
పోలీసులు కొట్టడం వల్లే మరియమ్మ మృతి చెందినట్టు కుటుంబసభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశించారు. దీంతో రాచకొండ సీపీ మహేష్ భగత్.. మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావును విచారణ అధికారిగా నియమించారు. లోతుగా విచారించగా పోలీసులు మరియమ్మపై చేయిచేసుకున్నారని, ఈ కారణంగానే ఆమె స్పృహ కోల్పయినట్టు వెల్లడైంది. ఆమెకు సత్వర వైద్యం కల్పించడంలో కూడ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని విచారణలో తేలింది. ఏసీపీ నివేదిక ఆధారంగా ఎస్.ఐ. మహేశ్వర్, కానిస్టేబుళ్లు జానయ్య, రషీద్ లను విధుల నుంచి తొలగిస్తూ రాచకొండ సీపి మహేష్ భగత్ ఉత్తర్వులు జారీ చేశారు.