మాతా.. శిశు మరణాలపై సమీక్ష..
1 min read– మాతా, శిశు మరణాల కట్టడికి పటిష్టచర్యలు..
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా, వీటి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవలసిన బాధ్యత వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖాధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. సోమవారం స్ధానిక జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో మాతా, శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాతా, శిశు మరణాలపై సమీక్ష జరిపి మాతృ మరణాలకు దారితీసిన కారణాలపై సంబంధిత వైద్యాధికారులు నివేదించిన నివేదికలను పరిశీలించారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నారు. గర్భిణీలకు అందించే చికిత్స విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని ముఖ్యంగా మహిళ గర్భం దాల్చినప్పటినుంచి ప్రసవం అయ్యేవరకు అన్ని పరీక్షలతోపాటు వారు తీసుకోవలసిన పౌష్టికాహారం జాగ్రత్తలపై ఎప్పటి కప్పుడు ఆరోగ్య విషయాలని తెలియజేయాలన్నారు. ఇదే సమయంలో వారి ఆరోగ్యస్ధితిని కూడా ఎప్పుడూ గమనిస్తూఉండాలన్నారు. ఈ విషయంలో వైద్యాధికారి మొదలుకొని ఎఎన్ఎం, ఆశా, తదితర సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉంటే మాతా, శిశు మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలన్నారు. క్షేత్రస్ధాయిలో గర్బవతుల్లో సాధారణంగా కనిపించే రక్తహీనత, అధిక రక్తపోటు సమస్యలను త్వరగా గుర్తించి తగు సూచనలను సంబందిత వైద్యాధికారులు ఎప్పటికప్పుడు అందించడం ద్వారా మాతృశిశు మరణాలను అరికట్టవచ్చన్నారు. వైద్య సిబ్బంది గర్భవతులకు, బాలింతలకు అందించే సేవల్లో ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తే మాతా, శిశు మరణాలను నిలువరించవచ్చన్నారు. గర్భందాల్చిన మహిళ పుట్టింటికి వెళ్లిన సమయంలోకూడా ఆమె ఆరోగ్య పరిస్ధితిని ఎఎన్ఎంలు పరిశీలించాలన్నారు. హైరిస్కు కేసులు ముందస్తుగా గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా రాత్రి సమయంలో మరణాలు సంభవించకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. హైరిస్కు కేసుల్లో గర్భందాల్చిన మహిళలకు 34వ వారం నుంచి ప్రతివారం వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన రీతిలో ఎంఎల్ హెచ్ పి లకు శిక్షణ అందించాలన్నారు. మాతా శిశు మరణాలు జరుగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై, అనుసరించవలసిన పద్దతులపై కొత్తగా వచ్చిన జూనియర్ డాక్టర్లకు సీనియర్ డాక్టర్లతో సమగ్ర శిక్షణ అందించాలని ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా. డి. ఆశ, డిఐఓ డా. నాగేశ్వరరావు, ఆర్ఎంఓ డా. పి. శ్రీనివాసరావు, గైనకాలజిస్ట్ డా. పద్మ, తదితరులు పాల్గొన్నారు.