దేశాభివృద్ధికి మౌలాన అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం
1 min readవిద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించి పది మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ ప్రగతికి, దేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, బెంగాలీ, హిందీ తదితర ఎన్నో భాషలు నేర్చుకోవడంతోపాటు తత్వశాస్త్రము, గణితము, చరిత్రలను అభ్యసించి తొలి విద్యాశాఖ మంత్రిగా దీర్ఘకాలం పనిచేసి దేశానికి విశిష్ట సేవలు అందించారని కలెక్టర్ కొనియాడారు. నేటి విద్యార్థులు కూడా ఆయన బాటలో నడిచి కొత్త విషయాలు నేర్చుకుని సమాజానికి ఏ విధంగా తన వంతు కృషి చేయగలమో నిర్దేశించుకోవాలని విద్యార్థులకు హిత బోధ చేశారు. హిందూ, ముస్లిం సఖ్యతకు ఎంతో కృషి చేసి అందరూ కలిసిమెలిసి ఉండాలనే లక్ష్యంతో ద హిలాల్ పత్రికను స్థాపించి ఐక్యతకు అబుల్ కలాం ఆజాద్ కృషి చేశారన్నారు. ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్య ఎంతో అవసరమని విద్య యొక్క ప్రాధాన్యతను విస్తృతంగా వ్యాప్తి చెందించడంలో అబుల్ కలాం ఆజాద్ విశిష్ట కృషి చేశారన్నారు.విద్యార్థులు ఉత్తమంగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో రాణించడంతోపాటు పదిమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని కలెక్టర్ ఉద్భోదించారు. కనీసం డిగ్రీ ఉత్తీర్ణత అయితే అన్ని పోటీ పరీక్షలకు అర్హత సంపాదించుకోవచ్చన్నారు. జిల్లాలో బాల్య వివాహాలను నియంత్రించి పిల్లలను బాగా చదివించి కెరీర్ పరంగా ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. చెడు వ్యసనాలు, చెడు సాన్నిత్యానికి బానిస కాకుండా చదువు, ఆటపాటల పట్ల తల్లిదండ్రులు, గురువులు దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియాపై ఆధారపడకుండా స్థానిక గ్రంథాలయాలకు వెళ్లి బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో అన్ని విధాల చురుకుగా ఉండగలిగే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మన జిల్లాలో ఉండడం గొప్ప అవకాశం అని ఉర్దూ పాఠశాలలు, కళాశాలలకు ఉన్న సమస్యలపై మంత్రి మార్గదర్శకాలతో పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మైనార్టీల సంక్షేమ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన కళా నృత్యాలు ఆహుతులను ఆకర్షణీయంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటాన్ని ఆవిష్కరించి, గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.