నూతన వధూవరులు జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి
1 min read
నిండు మనసుతో కొత్త జంటలను ఆశీర్వదించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస నేడు: తన జన్మదిన సందర్భంగా పెళ్లి చేసుకున్న జంటలందరూ జీవితాంతం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.స్థానిక మౌర్య ఇన్ కాంప్లెక్స్, పరిణయ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు వివాహం చేసుకున్న జంటలందరికీ టీజీ కుటుంబ సభ్యులందరూ తమ ఆశీర్వాదాన్ని అందజేశారు. పెళ్లి చేసుకున్న 75 జంటలకు ఒక్కొక్క జంటకు 80వేల రూపాయలు చొప్పున డీడీలను, చెక్కులను రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారు ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా ఆరోగ్యంగా ఉంటూ సంసారాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. తన కుమారుడు మంత్రి భరత్ తో పాటు కుటుంబ సభ్యుల సహకారం ఉన్నందునే తాను సేవా కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాననీ అన్నారు. తాము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఎటువంటి రాజకీయ లబ్దిని కోరుకోవడం లేదని, రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా తాము ఎన్నో కార్యక్రమాలు చేసామని టీజీ తెలిపారు. స్థానికంగా ఉంటూ ఇక్కడి ప్రాంత ప్రజల అభివృద్ధికి తమ వంతుగా సహకారం అందించాలన్నదే తమ కుటుంబ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. మంత్రిగా టీజీ భరత్ కూడా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చారని, మంత్రిగా కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. పరిశ్రమలు రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని, వారి గురించి తెలుసుకొని అటువంటి వారికి దూరంగా ఉండాలన్నారు. పరిశ్రమల రాకతో ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా ఆ ప్రాంతం అంతయు అభివృద్ధి చెందుతుందని టీజీ వెంకటేష్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎవరైతే ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారో అటువంటి వారిని ఆదరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి, శ్రీమతి టీజీ శిల్ప, టీజీ కుటుంబ సభ్యులు సునీల్, కృష్ణజోష్ణ, రవిరాజ్, మౌర్య తదితరులు పాల్గొన్నారు.