PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా ప్రజల చెంతకే వైద్య సేవలు

1 min read

– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
– ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన 16 నూతన 104 వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి,ఎమ్మెల్యేలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా ప్రజల చెంతకే వైద్య సేవలు చేరువ చేయడం జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.సోమవారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన 16 నూతన 104 వాహనాలను మంత్రి, ఎమ్మెల్యేలు, మేయర్, కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా వైద్య సేవలను అందిస్తూ వైద్య రంగానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో 104 వాహనాల్లో వైద్యులు, సిబ్బంది గ్రామాలకు వెళ్లి 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు అందించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఆసుపత్రులను నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టి ఎంతో మందికి వైద్య సేవలు అందించగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కి మరింత ప్రాధాన్యత ఇస్తూ, 3255 వ్యాధులకు వైద్యం అందించడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి దాకా 25 వాహనాలతో 104 వైద్య సంచార వాహనాల ద్వారా గ్రామాలలో పర్యటిస్తూ వైద్యం అందించడం జరుగుతోందని, ఇంకా ఎక్కువ స్థాయిలో వైద్యాన్ని అందించడానికి గాను ప్రభుత్వం మరో 16 నూతన 104 వాహనాలను మంజూరు చేసిందన్నారు.గ్రామాల్లో ప్రజలు ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా అందిస్తున్న వైద్య సేవలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు..జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ నెలకు రెండు పర్యాయాలు 104 వాహనం ద్వారా ఒక డాక్టర్, సూపర్వైజర్, ఏఎన్ఎం, ఆశా లుసాధారణ ఆరోగ్య సమస్యలు, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు, శిశువులకు, రక్త హీనత ఉన్న వారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు, కిడ్నీ సమస్య ఉన్న వారికి తదితరులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని, దీర్ఘకాలిక రోగులు, బాలింతలకు, వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్సలు చేసుకున్నవారికి వారి ఇంటివద్దనే చికిత్సలు అందించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు..పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా 104 వాహనాలు ప్రతి గ్రామంలో తిరుగుతూ వైద్యం అందిస్తూ గ్రామాలలోని ప్రజలకు పట్టణ ప్రాంతాలకు వచ్చి వైద్యం కోసం ఇబ్బంది పడకుండా గ్రామాల్లోనే వైద్యం అందించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లోని ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు.కోడుమూరు శాసనసభ్యులు జె.సుధాకర్ మాట్లాడుతూ ప్రజల వద్దకే గ్రామ సచివాలయ స్థాయిలో పరిపాలన అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి ముంగిటకు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హయాంలో విజయవాడలో ఒకేసారి వెయ్యి 108 వాహనాలను ప్రారంభించారన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా ప్రతి వాలంటీర్ సహాయంతో ఇంటింటికీ వెళ్లి వైద్యులతో వైద్యం అందించడం జరుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు కూడా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు కూడా అందజేయడం జరిగిందన్నారు.నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి 3 సార్లు రాగిజావ అందించడం జరుగుతోందన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాల రూపు రేఖలు మార్చి వాటికి మహర్దశకు కృషి చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం 104 వాహనాల ర్యాలీ రాజ్ విహార్, కొండా రెడ్డి బురుజు, కలెక్టరేట్ మీదుగా తిరిగి ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి.కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా.మధుసూధన్, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, ఆర్డీఓ హరిప్రసాద్, డిఎంహెచ్ఓ రామ గిడ్డయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author