జిల్లాలో రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనుల పై సమావేశం
1 min read– జిల్లాలో రైల్వే గేట్ల పై రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ అధికారులకు సహకరించండి…
– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో రైల్వే గేట్ల పై రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ అధికారులకు తగిన విధంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనుల పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ భారత్ మాల ప్రాజెక్టు క్రింద (కేంద్ర ప్రభుత్వ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖ) మరియు రైల్వే శాఖ కి చెందిన గతి శక్తి ప్రాజెక్టులు సంయుక్తంగా జిల్లాలోని తొమ్మిది రైల్వే లెవెల్ క్రాసింగ్ ల పైన రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణాలకు 100 శాతం నిధులు సంయుక్తంగా భరిస్తుందన్నారు. జిల్లాలోని తొమ్మిది రైల్వే లెవెల్ క్రాసింగ్ ల దగ్గర బ్రిడ్జిల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకరించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, నిర్మాణాలు ఏవి కూడ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని నష్టపోవాల్సి వస్తే వారి నుండి నష్టపరిహారం పొందే విధంగా చర్యలు ఉండాలని, అవసరమైన ప్రాంతంలో రీ లోకేషన్ మరియు రిహాబిలిటేషన్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా జరగవలసిన సంయుక్త (రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు రైల్వే శాఖ) సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.సమావేశానికి ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వర రావు, ట్రాన్స్కో ఎస్ఈ ఉమాపతి సంబంధిత శాఖల ఇంజనీర్లు, రైల్వే ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.