జిల్లాలో కుల గణన పై అధికారులతో సమావేశం..
1 min readకుల గణనే ముఖ్య ఉద్దేశం.. జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని నిరుపేద కులాల వారికి అందించడమే కుల గణన ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. జిల్లాలో కుల గణన నిర్వహణపై వివిధ వర్గాల ప్రజలకు అవగాహన, సూచనలు స్వీకరణకై శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ షేక్ సాబ్జి , వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అవగాహనా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ అన్ని నిరుపేద వర్గాలకు సామాజిక న్యాయం అందించాలన్నదే కులగణన ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో కులగణన సర్వే ఈనెల 27వ తేదీ నుండి వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, సంచార జాతులు, వలస కార్మికులు వంటి సర్వే సమయంలో అందుబాటులో లేనివారు వారి వివరాలు సర్వే చేయడం కోసం మరో వారం రోజులు సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న కుల గణన సర్వే లో ప్రజల ఆర్ధిక, సామజిక స్థితిగతులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన సంక్షేమ పధకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కుల గణన సర్వే గ్రామ/వార్డ్ సచివాలయాలు పరిధిలో నిర్వహించడం జరుగుతుందని, కుటుంబ సభ్యుల విద్య, ఆర్ధిక, సామజిక, కులం, ఉపకులం వివరాలు కులగణన ప్రత్యేక యాప్లో పొందుపరచడం జరుగుతుందన్నారు. సర్వే లో సచివాలయ కార్యదర్శి, వాలంటీర్లు పాల్గొంటారన్నారు. కుటుంబ సభ్యులు తెలియజేసిన కులాన్ని పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందని, కుల నిర్ధారణ కోసం ఎటువంటి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవలసిన అవసరం లేదన్నారు. కుటుంబంలోని సభ్యులు వివిరాలు యాప్లో నమోదు చేసిన తరువాత 18 సంవత్సరాలు వయస్సు నిండిన సభ్యులు ఈ-కె వై సి తో నిర్దారించవలసి ఉంటుందన్నారు. ఈ సర్వే లో సేకరించిన వివరాలతో ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమానికి అనుసంధానించడం జరగదని, ఏ సంక్షేమ పధకం తొలగించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. సర్వే ద్వారా ప్రజల కనీస అవసరాల కల్పన, భవిష్యత్తులో నిరుపేదల సంక్షేమానికి పధకాల అమలుకు దోహపడుతుందన్నారు. సర్వే లో సేకరించే డేటా పూర్తి భద్రతతో పరిరక్షించడం జరుగుతుందని, ఈ విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలు పడొద్దన్నారు.జిల్లాలో 696 కులాలు, ఉపకులాలున్నాయని, వాటిని యాప్లో పొందుపరచడం జరిగిందని, వాటిలో లేని కులాలు గాని, ఉపకులాల గాని తమ దృష్టికి తీసుకువస్తే వాటిని కూడా యాప్ లో పొందుపరచడం జారుతూగుందన్నారు. ఈ సర్వే ని ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలోని 3, పట్టణ ప్రాంతంలోని 2 సచివాలయాలలో ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరిగిందన్నారు. సర్వే నిర్వహణ కోసం మండల స్థాయిలో 5గురు అధికారులతో కమిటీలు ఏర్పాటుతో పాటు జిల్లాలో స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో కులగణన సర్వే విజయవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ దేశంలో కుల గణన 1931 సంవత్సరంలో చేపట్టారని, మళ్ళీ ఎన్నో దశాబ్దాల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో దేశంలోనే మన రాష్ట్రంలో కులగణన చేపట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. దీని కారణంగా నిరుపేద వర్గాలకు మరింత సంక్షేమ ఫలాలు, ఆర్ధిక, సామజిక, రాజాకీయపరంగా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను తాను స్వాగతిస్తున్నామన్నారు. యాప్ లో కోరిన వివరాలతో సమగ్ర సమాచారం రాదని , వీటిలో మరికొన్ని అంశాలను చేర్చవలసి ఉందన్నారు. సివిల్ కండక్ట్ రూల్స్ పరిధిలో లేని గ్రామ/వార్డ్ వాలంటీర్లకు సర్వే నిర్వహణను అప్పగించవద్దన్నారు. సర్వే చేపట్టడంతో పాటు కులగణనకు చట్టబద్దత కల్పించాలని, బీహార్ రాష్ట్రంలో చేసిన కులగణనకు చట్టబద్దత కల్పించి, రిజర్వేషన్లను సవరించని, అదే విధంగా రాష్ట్రంలో అసెంబ్లీ లో ప్రత్యేక సమావేవం నిర్వహించి, కులగణన ప్రాతిపదికన నిరుపేద, వెనుకవర్గాలు రాజకీయ, చట్టసభలలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కులగణన సర్వే కి వారం రోజులు సమయం సరిపోదని, సమయం మరింత పెంచాలని కోరారు. జిల్లా, మండల స్థాయి కమిటీలలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో మెండెం సంతోష్ కుమార్, దేవరకొండ వెంకటేశ్వర్లు, అప్పభక్తుల శివకేశవరావు, పొలిమేర హరికృష్ణ, చప్పిటి గంగాధరరావు, ప్రభృతులు తమ సూచనలు అందించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీపూజ, జిల్లా పరిషత్ సీఈఓ సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.