ఒంటెద్దు బండి పందెం విజేతకు అర కిలో వెండి బహుకరించిన మంత్రి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో టిజివి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంటెద్దు బండ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వెంకటరమణ కాలనీకి చెందిన హుశేనీ ఎద్దు మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో బంగారుపేటకు చెందిన మద్దిలేటి ఎద్దు నిలిచింది. వెంకట రమణ కాలనీలోని రఫికి చెందిన ఎద్దు మూడవ స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం గెలిచిన ఎద్దుల యజమానులకు మంత్రి టి.జి భరత్ ఆయన కార్యాలయంలో బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన హుశేనీ ఎద్దుకు మంత్రి టీజీ భరత్ అర కిలో వెండిని బహుమతిగా అందించారు. రెండవ స్థానంలో వచ్చిన ఎద్దుకు మార్కెట్ వ్యాపారస్థులు 15 తులాల వెండి, మూడవ స్థానంలో నిలిచిన ఎద్దుకు మార్కెట్ కమిటీ 10 తులాల వెండిని బహుమతిగా ఇచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిజివి ట్రేడ్ యూనియన్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శేషగిరిశెట్టి, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు బాలయ్య, టిడిపి వార్డు నాయకులు రాజశేఖర్ రెడ్డి, ఏసు, తదితరులు పాల్గొన్నారు.