ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి… టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎగ్జిబిషన్ ద్వారా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఇన్ని రోజులూ తమ కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ జేబులోకి వెళ్లాయన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యాఖ్యలను కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు టి.జి భరత్ ఖండించారు. సొసైటీ సభ్యులతో కలిసి కిడ్స్ వరల్డ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీని నిజాయితీగా నడుపుతూ కర్నూలు ప్రజలకు వినోదాన్ని అందించే తనపై, తన తండ్రి టీజీ వెంకటేష్ పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ సొసైటీపై అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆయన చేసిన ఆరోపణలపై సీబీఐతో కానీ, సీఐడితో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని.. విచారణకు పిలిపిస్తే తమ దగ్గర ఉన్న రికార్డులన్నీవారికి అందజేస్తామన్నారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని భరత్ అన్నారు. సొసైటీపై అసత్య ఆరోపణలు చేసిన ఆయన 24 గంటల్లో తమకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయనపై క్రిమినల్ పరువునష్టం కేసు వేస్తానన్నారు. తమ సొసైటీలో ఎక్స్ అఫిషియో ఛైర్మన్ గా జిల్లా కలెక్టర్, ఈ.సి మెంబర్లుగా జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఇండస్ట్రీస్ జీయం, అగ్రికల్చర్ జే.డితో పాటు వైసీపీకి చెందిన అహ్మద్ ఆలీఖాన్, మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఇంకా ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ఆయన చేసిన ఆరోపణల వల్ల జిల్లా కలెక్టర్ ని అవమానించినట్లుందన్నారు. ప్రజలకు వినోదాన్ని పంచే ఎగ్జిబిషన్ ను వేలం ద్వారా నిర్వహించకుండా.. సంవత్సరంలో 3 నెలలు తమ సొసైటీ ద్వారా నిర్వహించుకునే వీలు కల్పించాలని తాను అధికారులకు విన్నవిస్తే ఈయన అర్థంలేని ఆరోపణలు చేశారన్నారు. వేలం ద్వారా ఎగ్జిబిషన్ నిర్వహిస్తే ఎంట్రీ టికెట్ల రేట్లు వంద రూపాయల దాకా ఉండటం వల్ల ప్రజలకు భారం పడుతుందని.. ఇప్పుడు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో ఎంట్రీ టికెట్లపై రేటు కూడా లేదని, ట్యాక్సులు కడుతున్నారో లేదో తెలియదన్నారు. ఇక ఎన్నికలు నిర్వహించకుండా సొసైటీని నిర్వహిస్తున్నారన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఆయన తండ్రి ప్రతి సంవత్సరం వచ్చి ఎన్నికలు నిర్వహించినప్పుడు సంతకం చేస్తున్నారని చెబుతూ దీనికి సంబంధించిన పత్రాలు భరత్ చూపించారు. ఇంట్లో ఉన్న ఆయన తండ్రిని చూసి హుందాతనం నేర్చుకోవాలన్నారు. కర్నూల్లో పేరొందిన కోట్ల ఫ్యామిలీ, కేఈ ఫ్యామిలీ, ఎస్వీ ఫ్యామిలీతో పాటు గఫూర్ గారు కూడా ఏనాడు తమ కుటుంబం డబ్బులు తినిందన్న ఆరోపణలు చేయలేదన్నారు. కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీని టిజివి ఎగ్జిబిషన్ ప్రైవేట్ లిమిటెడ్ గా పెట్టుకోవాలన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. కర్నూల్లో ఇంత కరెక్టుగా నడుపుతున్న సొసైటీ ఇంకేది ఉందో చూపించాలని.. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ప్రజా సేవలో తాము ఉన్నందుకే ఆయన స్థాయి గురించి తాను మాట్లాడానన్నారు. ఈయన ఇప్పుడొచ్చి ఎమ్మెల్యే అయ్యాక ఏవో పనులు చేశానంటారని.. అంతకుముందు ఆయన ఏం ప్రజాసేవ చేశారన్నారు. ఇప్పటికే ఆయనకు కర్నూల్లో ఒక మొగుడు ఉన్నారని, మళ్లీ కొత్తగా ఇంకో మొగుడుని ఆయన పార్టీ అధిష్టానం తెచ్చి పెట్టిందన్నారు. ఆరోజు ఈయన గాలిలో గెలిచారని ఆయన దగ్గర ఉన్న ఇద్దరు మొగుడుల్లో ఒక మొగుడు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారన్నారు. అందుకే ఆయనకు గాలి ఎమ్మెల్యే అని బిరుదు వచ్చేసిందన్నారు. ఇక సోషల్ రెస్పాన్సబులిటీ కింద తాము కిడ్స్ వరల్డ్ తీసుకుంటే.. కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీకి దీనికి లింక్ పెట్టి అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రూ. 5 టికెట్ పెట్టి కిడ్స్ వరల్డ్ నిర్వహిస్తున్నామని.. ప్రజలకు వినోదాన్ని అందిస్తూ తక్కువ రేట్లతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలు పెట్టి ప్రజలకు సౌకర్యవంతంగా ఆయన పార్కు పెట్టి నడిపించాలన్నారు. కర్నూల్ నగరంలోని పార్కులను ఫ్రీగా నడిపిస్తున్నట్లు ఆయన చెబుతున్నారని.. గాంధీ నగర్ చిన్న పార్కును వినియోగంలోకి తేకుండా మూడేళ్లుగా పనులు చేస్తూనే ఉన్నారన్నారు. అక్కడ ఇన్ని రోజులుగా జరుగుతున్న పనులకు లెక్కలు చూపించాలని.. ఇప్పటికైనా బుద్ది మార్చుకొని వ్యవహరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ట్రెజరర్ స్కంద కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ బాబు, ఈ.సి మెంబర్ నిర్మల్ కుమార్, సభ్యులు ప్రకాశ్ రెడ్డి, పత్తి ఓబులయ్య, గోపి క్రిష్ణా రెడ్డి, ముర్తజా పాల్గొన్నారు.