స్వార్థం తప్ప ప్రజల క్షేమాన్ని , సంక్షేమాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే
1 min readమాయ మాటలతో పబ్బం గడువు కోవాఆయన నైజం..
ఏలూరు టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : తన స్వార్థం తప్ప ప్రజలకు మంచి చేసే అలవాటు లేని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మరోసారి ఎన్నికల ముందు తన విన్యాసాలు చూపుతున్నారని, అయితే ఆయన మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు లేరని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏలూరు పవర్ పేటలోని టిడిపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన అవసరానికి ప్రజలను వాడుకోవడం, వారు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం ఎమ్మెల్యే ఆళ్ల నానికి అలవాటుగా మారిందని విమర్శించారు. గతంలో ఏలూరు జూట్ మిల్ మూతపడిన సమయంలో నాకెందుకులే అని వ్యవహరించిన ఆయన ఇప్పుడు కొత్తూరు జూట్ మిల్ యాజమాన్యం కార్మికులకు దీపావళి పండుగ బోనస్ ఇవ్వకుండా మాయ చేస్తే నోరు మెదపకపోవడం ఎమ్మెల్యే నైజామును తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ప్రజానాయకుడు ఉండడం వల్లే యాజమాన్యాలు కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకోవడం, దాచుకోవడం లో సిద్ధహస్తులైన వైసీపీ నాయకుల జాబితాలో ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా చేరిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల క్షేమాన్ని , సంక్షేమాన్ని పట్టించుకోకుండా మాయమాటలతో పబ్బం గడు పుక్కోవటం ఆయన నైజం అన్నారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి వారిని నిలువునా ముంచేశారని ఆయన విమర్శించారు. ఏలూరు నియోజకవర్గ పరిధిలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చారని, అయితే ఆయన ఇళ్లు నిర్మించకుండానే లబ్ధిదారుల నుండి సొమ్ములు భోంచేసి మాయమైపోయారని బడేటి చంటి ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ను తిరిగి తీసుకువచ్చారని అయితే అతను ఇళ్లు నిర్మిస్తాడా, మళ్లీ లబ్ధిదారుల నుండి సొమ్ములు వసూలు చేస్తాడా, తిరిగి వాళ్ల నెత్తిమీద శటగోపం పెడతాడా అన్న ప్రశ్నలకు ఎమ్మెల్యే ఆళ్ల నానినే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన కోరారు. ఇక ఎమ్మెల్యే మాటలకు తలాడిస్తున్న మేయర్ ఒంటెద్దు పోకడలతో కౌన్సిల్ తీర్మానాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కృష్ణ కాలువ వద్ద ఒక కార్పొరేటర్ కు హోటల్ పెట్టుకునేందుకు అనుమతినిస్తూ కౌన్సిల్ తీర్మానించిందని, అయితే వ్యవహారానికి న్యాయస్థానం జోక్యంతో బ్రేక్ పడిందన్నారు. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి మేయర్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. అందమైన అబద్ధాలు అల్లడం లో వైసీపీ ప్రజా ప్రతినిధులు రాటు తేలిపోయారని ఆయన విమర్శించారు. కుల సంఘాలకు కూడా స్థలాల పందేరం చేస్తున్నారని, భవిష్యత్తులో వీటి విషయంలో కూడా నిజాలు బయటికి వస్తే బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన నిలదీశారు. ఇప్పటికే ఎమ్మెల్యే వ్యవహార శైలి కారణంగా కొన్ని కులాల మధ్య చిచ్చురేగిందని, ఇప్పుడు ఆయన చూపుతున్న కపట ప్రేమతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆయా వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు. ఇక అర్హులైన జర్నలిస్టులందరికీ దీపావళి కానుకగా జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు అందించనున్నారని అర్బాటంగా చేసిన ప్రకటన నీటి మీద రాతలుగా మారిందని బడేటి చంటి ఎద్దేవా చేశారు. తాజాగా ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 10 శాతం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగదన్న విషయం స్పష్టమైందన్నారు. ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసిన సైకో సీఎం జగన్ చివరకు జర్నలిస్టులపై తనకున్న కోపాన్ని ఈ విధంగా తీర్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పెద్ది బోయిన శివప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నాయుడు, మాజీ కార్పొరేటర్ మారం హనుమంతరావు, మరియు క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు పాల్గొన్నారు.