భక్తులతో కిటకిటలాడిన మూల పెద్దమ్మ ఆలయం
1 min read– జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గురువారం నుండి మొదలైన శ్రీ మూల పెద్దమ్మ జాతరకు ఉమ్మడి జిల్లాలే కాక,పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శుక్రవారం నాడు జాతర సందర్భంగా మూల పెద్దమ్మ ను దర్శించుకున్నారు.జాతర సందర్భంగా దేవస్థానం సిబ్బంది వారిచే అమ్మవారికి ప్రత్యేక పూజ, ఆకు పూజ, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.ఆలయ ఈవో ఎస్.మోహన్ ఆలయ చైర్మన్ చిన్నన్న,ఆలయ ధర్మకర్తలు, మహిళలకు,పురుషులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పాణ్యం సీఐ వెంకటేశ్వరరావు, గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.జాతరకు విచ్చేసిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు మంచినీటి సదుపాయాన్ని కల్పించారు.పద్మావతి కాంప్లెక్స్ వారు భక్తులకు ఉచితంగా మంచినీటి వాటర్ ప్యాకెట్స్ ను పంచారు. మండల బిజెపి నాయకులు ద్వారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.అలాగే గురువారం సాయంత్రం వాల్మీకులు అందరూ దేవస్థానం వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ఘటానికి పోయి వచ్చారు.అనంతరం మేళతాళాల నడుమ భక్తిశ్రద్ధలతో బొణము కుండలతో అమ్మవారి దర్శనం చేసుకున్నారు.రాత్రి సినీ ఆర్కెస్ట్రా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.