మాతృ భాష.. అమృతం లాంటిది…
1 min read
సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు , కర్నూలు: దేశ భాషల్లో ఏ భాషకు లేని గొప్పతనం తెలుగు భాషకు ఉందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. మాతృ భాష దినోత్సవం సందర్భంగా ఘంటసాల గాన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ గ్యా స్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తెలుగు భాషను విన్నా.. మాట్లాడినా శరీరం పులకరించి పోతుందన్నారు. చిన్న వయసులోనే నేర్చుకున్న తెలుగు భాష విలువ ఎంతో గొప్పదని, అందులో జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తి ఎంతో ఇమిడి ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరు మాతృభాషను విస్మరించరాదని దాని తరువాతే ఎన్ని భాషలు అయినా నేర్చుకోవచ్చని ఆయన తెలియజేశారు. మాతృభాష అయిన తెలుగు భాషను కాపాడాలని తెలుగు భాషా అభిమానులు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని వివరించారు. 1952లో ఈస్ట్ పాకిస్థాన్లో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ అప్పట్లో బెంగాల్ ను మాతృభాష చేయాలని కోరడంతో ఉర్దూ ను మాతృభాషగా చేసే ప్రయత్నం చేశారని, దానిని అడ్డుకునే క్రమంలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలుగు వారందరినీ ఒకచోట చేర్చి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు 56 రోజులపాటు ఆవరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారని అలాంటి మహనీయుల త్యాగాలు వృధా కాకూడదని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగులో మాట్లాడటం చాలామందికి కష్టంగా మారుతుందని కానీ తెలుగు భాష ప్రాధాన్యతను ఎవరు విస్మరించరాదని కోరారు.తెలుగు భాషలో కుటుంబ బంధాలు, నాగరికత, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇమిడి ఉన్నాయని ఆయన తెలియజేశారు .ప్రపంచంలోని అన్ని దేశాలలో తెలుగువారు ఆయా రంగాల్లో రాణించి తెలుగుజాతి గొప్పతనాన్ని చాటుతున్నారని వివరించారు .అంతర్జాతీయ స్థాయిలో ఏ దేశంలో వెళ్ళినా, విమానాశ్రయాల్లో…. నలుగురు తెలుగువారు కలిసిన ప్రతిచోట తెలుగు మాట్లాడుతుంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిదని ఆయన వివరించారు. వీలైనంతవరకు ప్రతి ఒక్క తెలుగు వాడు తెలుగులోనే మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల గాన కళా సమితి ప్రతినిధులు డాక్టర్ డబ్ల్యూ సీతారాం, చంద్రశేఖర్ కల్కురా, వాసుదేవరావు, ఎలమర్తి రమణయ్య, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
