అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు: ఏఐఎస్ఎఫ్
1 min readపల్లె వెలుగు వెబ్, నందికొట్కూరు : నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి, వారిని పోలీసులతో అక్రమ అరెస్టు చేయిస్తున్నారని, అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎం.శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పాదయాత్ర, ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన జగన్.. సీఎం అయిన తరువాత ఉద్యోగాలు ఇవ్వమని అడిగి నందుకు అరెస్టు చేయించడం సిగ్గుచేటన్నారు. గత నెల 18న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను వెంటనే రద్దు చేసి… వివిధ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరుతూ.. విద్యార్థి యువజన సంఘాలతో కలిసి ఏపీ ఉద్యోగపోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న ఛలో తాడేపల్లి ముఖ్యమంత్రి విజ్ఞాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి వెళ్తున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎం. శ్రీనివాసులు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ముచ్చుమర్రి స్టేషన్ నుంచి ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమకారులను బెదిరించాలని చూస్తే ఆందోళన లు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.