PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఎంఎస్ఎంఇ యూనిట్లను ప్రోత్సహించాలి..

1 min read

ప్రధాన బ్యాంకు శాఖలన్నీ పిఎంఇజిపి కింద కనీసం రెండు, మూడు డైరీ యూనిట్లను ఏర్పాటుకు ముందుకు రావాలి..

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పధకం కింద అందిన ధరఖాస్తుల్లో అత్యధికంగా తిరస్కరణపై జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్  గౌతమీ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి సమీక్షా కమిటీ(డిసిసి) నాల్గవ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ (పిఎంఇజిపి ) కింద ఉపాధి కల్పించేందుకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నప్పటికి అందుకు సంబంధించి వివిధ బ్యాంకులకు 580 ధరఖాస్తులు రాగా వాటిలో 223 తిరస్కరణకు గురికాగా వాటిలో కేవలం హెచ్ డిఎఫ్ సి బ్యాంకు 117 ధరఖాస్తులను తిరస్కరించడం పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.  అదే విధంగా మరో 79 ధరఖాస్తులను పెండింగ్ లో పెట్టారని ఇందుకు గల కారణాలను ధరఖాస్తువారీగా నివేదిక రూపొందించి వచ్చే సమావేశం నాటికి సమర్పించాలని సంబంధిత బ్యాంకు అధికారును కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.  జిల్లాలో అర్బన్ ప్రాంతం తో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (యం యస్ యం ఇ)యూనిట్లు నెలకొల్పేందుకు బ్యాంకర్లు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ముఖ్యంగా ఐటిడిఏ ప్రాంతంలో యూనిట్ల స్ధాపనకు సంబంధిత బ్యాంకర్లతో ఐటిడిఏ పివో తో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.ఎంఎస్ఎంఇ కింద  పాతయూనిట్ల విస్తరణకు రుణమంజూరు చేయడమే కాకుండా కొత్త యూనిట్లు ఏర్పాటుకు అత్యధిక ప్రోత్సాహం అందించాలని, ఆదిశగా చర్యలు ముమ్మరం చేయాలన్నారు.  తద్వారా జిల్లా అంతా సమాంతరంగా పారిశ్రామిక అభివృద్ది చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు.  వచ్చే సమావేశం నాటికి ఎంఎస్ఎంఇ కింద ఆయా బ్యాంకుల వారీ కొత్తయూనిట్లు ఎన్ని మంజూరు చేసింది, సంబంధిత యూనిట్లను నెలకొల్పడం ద్వారా ఎంతమంది ఉపాధి పొందింది వివరాలు అందించాలని సూచించినప్పటికీ 2,3 బ్యాంకులు తప్పా మిగతా వారు స్పందించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇదే పనితీరు కనిపిస్తే సంబంధిత విషయాన్ని ఎస్ఎల్ బిసి దృష్టికి వెళ్లవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. జిల్లాలోఉన్న ప్రధాన బ్యాంకు శాఖలన్నీ పిఎంఇజిపి కింద వచ్చే సమావేశం నాటికి కనీసం రెండు, మూడు డైరీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. పాలు కొనుగోలుకు అమూల్ వంటి సంస్ధలు సిద్ధంగా ఉన్నాయని దీనిమూలంగా లబ్దిదారులు తాము తీసుకున్న రుణాలు సక్రమంగా తిరిగి చెల్లింపుకు అవకాశాలు ఉన్నాయన్నారు. పిఎంఇజిపి కింద ఇప్పటికే ఏర్పాటైన డైరీయూనిట్ల విజయగాథను చిత్రీకరించి మిగిలిన ప్రాంతాల్లో లబ్దిదారులకు పశుసంవర్ధకశాఖ, బ్యాంకర్లు అవగాహన పరచాలన్నారు.  ఇందులో భాగంగా ఎస్ బిఐ, బ్యాంక్ ఆఫ్ భరోడా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు మోడల్ డైరీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  పాడి పశువుల కొనుగోలుకు షెడ్ల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలకు పిఎంఇజిపి కింద ప్రోత్సహించాలని ఈ పధకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో 25 శాతం, గ్రామీణ ప్రాంతంలో 35 శాతం కల్పిస్తున్న రాయితీ వివరాలను కూడా లబ్దిదారులకు తెలియపరచాలన్నారు.   పిఎంఇజిపి కింద మరి ముఖ్యంగా తాడువాయి ప్రాంతంలో ఉపాధి యూనిట్లు నెలకొల్పేందుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు.  ఆర్ధిక అక్షరాస్యతపై పెద్దఎత్తున అవగాహన కలిగించే కార్యక్రమాలు ముమ్మరం చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు.  కళాశాలలు, పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ సమయంలో, వివిధ పరిశ్రమల్లో ఆయా భోజన విరామం సమయాల్లో ఆర్ధిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఉపాధిహామీ పనులు జరుగుతున్న ప్రాంతంలో పనులు అనంతరం అక్కడ కార్మికులకు ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద సర్వీసు,తయారీ రంగాల్లో ఉపాధియూనిట్లు నెలకొల్పేందుకు ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం సబ్సిడీతో కూడిన రుణాలను అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకునేలా చొరవచూపాలన్నారు.   డిసిసి కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎం. గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి సంబంధించి డిశంబరు నాటికి రూ. 5,817 కోట్లు స్వల్పకాలిక వ్యవసాయరుణాలు అందించడం జరిగిందన్నారు. సిడిరేషియో ఆర్బిఐ ప్రమాణాల మేరకు కనీసం 60 శాతం ఉండాల్సిఉండగా ఏలూరు జిల్లాలో ఇది 193 శాతంగా ఉందన్నారు.  గ్రామీణ డ్వాక్రా మహిలా సంఘాలకు ఈఏడాది 26 వేల 200 సంఘాలకు రూ. 1035 కోట్లు రుణాలు అందించాలనే లక్ష్యానికి ఇంతవరకు 24,437 సంఘాలకు రూ. 2,156 కోట్లు అందించామన్నారు.  పట్టణ డ్వాక్రా మహిళా సంఘాలకు రూ. 229 కోట్లు రుణాలను అందించాలనే లక్ష్యానికి డిశంబరు వరకు 2,550 సంఘాలకు రూ. 353 కోట్లు అందించామన్నారు.  జిల్లాలో ఈఏడాది డిశంబరు వరకు రూ. 106 కోట్ల విద్యారుణాలు, రూ. 534 కోట్లు హౌసింగ్ రుణాలు అందించామన్నారు. ఆర్బిఐ కి చెందిన ఎల్ డిఓ పూర్ణిమ మాట్లాడుతూ ప్రతి బ్యాంకు శాఖ నిర్ధేశిత లక్ష్యాలు చేరుకునే విదంగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.  సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజరు డి. నీలాధ్రి గత సమావేశంలో తీర్మానించిన అంశాలపై తీసుకున్న చర్యలను, ఆయా బ్యాంకుల వారీగా లక్ష్యాలు, సాధించిన పురోగతిని వివరించారు.   సమావేశంలో ఆర్బిఐ కి చెందిన ఎల్ డిఓ పూర్ణిమ నాబార్డ్ డిడిఎం అనీల్ కాంత్,ఎల్ డిఎం డి. నీలాధ్రి,డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ, పశు సంవర్ధక శాఖ జెడి డా. జి. నెహ్రూబాబు, మెప్మా డిపి ఇమ్మానియేల్, ఉధ్యానశాఖ డిడి రామ్మోహన్ , జిల్లా మైనాటికీ సంక్షేమాధికారి ఎన్.ఎస్. కృపావరం, వివిధ శాఖల అధికారులు, పలు బ్యాంకుల జిల్లా కో-ఆర్డినేటర్లు, మేనేజర్లు పాల్గొన్నారు.

About Author