పంటలకు బహుళ ప్రయోజనకారి.. ఈ-క్రాఫ్
1 min read– 1.97 లక్షల మంది రైతులకు ఈ-కెవైసి పూర్తి.. జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: ఈ చరాచర జగత్తులో రైతన్నలకు విశిష్ట స్థానం ఉంది. వ్యవసాయ రంగంపైనే జాతి మనుగడ ఆధారపడి వుంది. ఈ క్రమంలోనే భాగంగా రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యనిచ్చి వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు పరుస్తోంది. రైతు శ్రేయస్సే పరమావధిగా అనేక రాయితీలు కల్పించి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతులకు ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, వ్యవసాయం మరియు అనుబంధ శాఖల ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర తదితర రైతు సంబంధిత సంక్షేమ కార్యక్రమాలకు ఈ-క్రాప్ డేటానే మూలం. రైతన్నలు వేసిన పంటలకు బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడనుంది ఈ-క్రాప్. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ క్రాప్ నమోదు మరియు ఈ కేవైసీ లను పకడ్బందీగా నిర్వహించి ఈ-పంట ముసాయిదా జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఒక ప్రకటనలో తెలిపారు.నంద్యాల జిల్లాలో 2022 ఖరీఫ్ లో 6,27,879 ఎకరాలలో రైతులు వరి, వేరుశనగ, కంది, పత్తి, మినుము, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. గ్రామ వ్యవసాయ అధికారి, గ్రామ ఉద్యాన అధికారి సచివాలయ అసిస్టెంట్ మరియు విఆర్వో కలిసి సంయుక్తంగా రైతులు వేసిన పంటలను పరిశీలించి 5,97,362 ఎకరాలలో ఈ-పంట నమోదు చేయడం జరిగింది. ఇందులో 1.97 లక్షల మంది రైతులకు ఈ-కెవైసి పూర్తి చేసారు.సామాజిక తనిఖీల్లో భాగంగా జిల్లాలోని 413 రైతు భరోసా కేంద్రాల్లో శుక్రవారం నుండి ఈ-పంట ముసాయిదా జాబితాను ప్రదర్శించడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించిన ఈ – క్రాప్ నమోదు జాబితా పరిశీలించుకొని నమోదులో ఎక్కడైనా పొరపాట్లు వుంటే సరి చేసుకునేందుకు నవంబరు 1వ తేదీ వరకు గడువు వుందని ఈ అవకాశాన్ని రైతులకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సాగుచేసిన పంట నమోదులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లైతే సవరణ కొరకు రైతు భరోసా కేంద్ర పరిధిలో వున్న వి.ఏ.వి./వి.హెచ్.ఏ/ ఏ.ఎస్.ఏ లను సంప్రదించి అభ్యంతరాలను వ్రాత పూర్వకముగా దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా రైతులను విజ్ఞప్తి చేశారు. మార్పులు, చేర్పులు అనంతరం తుది జాబితాలను నవంబర్ 5 వ తేదీన రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. పంట నమోదు చేసిన వివరాలు మండల వ్యవసాయ అధికారి నుండి మండల తాసిల్దార్, మండల ఉద్యాన అధికారి, సహాయ వ్యవసాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఉద్యాన అధికారి,ఆర్డీవోలు జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది.విత్తనం నుండి విక్రయం దాకా రైతుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించనున్నామని….రైతన్నలందరూ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఆర్థిక పరిపుష్టి పొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు.