నందికొట్కూరు టికెట్ పై యువనేత గురి
1 min readకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు.
స్థానికుడు కాసారపు వెంకటేష్ పేరు తెరపైకి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరుపున యువ నాయకుడు వెంకటేష్ టికెట్ పై గురి పెట్టారు. ఎలాగైనా పార్టీ తరపున బరిలో నిలిచి గెలవాలని చూస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలను కలిసి తమ వంతు ప్రయత్నాల్లో బిజీ అయిపోయినట్లు సమాచారం.ఈ మేరకు ఆయనకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటేష్ పేరు తెరపైకి..
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసారపు వెంకటేష్ పేరు వినిపిస్తోంది. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు కాసారపు వెంకటేష్ తన మార్గాన్ని సుగమమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయనకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలతోసత్సంబంధాలు ఉన్నాయి. కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు.కళాశాల రోజుల నుంచే విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ విద్యార్ధి సంఘం నాయకుడుగా ఎదిగారు.విద్యాభ్యాసం ఇంటర్ వరకు ఆత్మకూరు లోనే సాగింది. డిగ్రీ కర్నూలులో, ఉన్నత విద్యా ఎంబీఏ హైదరాబాద్ లో పూర్తి చేశారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థుల కోసం ఎన్నో సేవలు చేసి వారి సమస్యలు పరిష్కారం కోసం పోరాడారు. ప్రస్తుతం దళిత సమస్యల పైన పోరాటం కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలతో …
నందికొట్కూరు టికెట్ కోసం రెండు దఫాలుగా ఏఐసీసీ ముఖ్య నేతలను కలిసి సంప్రదింపులు జరిపి టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈయనకు ఉమ్మడి కర్నూలు జిల్లా లోని ప్రజా సంఘాల నేతలు, కుల సంఘాల నాయకుల మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హస్తం పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు మండలాల్లో పట్టున్న నాయకులు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పలువురు ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వెంకటేష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ పట్ల కాంగ్రెస్ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది.