జాతీయ లైవ్ స్టాక్ మిషన్ జిల్లాస్ధాయి అవగాహన సదస్సు
1 min readజాతీయ లైవ్ స్టాక్ మిషన్ పధకం ఔత్సాహిక రైతులకు,
నిరుద్యోగులకు,వ్యాపార సరళిలో ప్రోత్సాహం..
అవగాహన సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి వెల్లడి..
జెడి జి నెహ్రూ బాబు అధ్యక్షతన సదస్సు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఔత్సాహిక రైతులకు, నిరుద్యోగులకు, వ్యాపారసరళిలో ప్రోత్సహించేందుకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పధకం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డా : జి నెహ్రూబాబు అధ్యక్షతన పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ జిల్లాస్ధాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంవర్ధకశాఖ వారు గ్రామీణస్ధాయిలో పశుపోషణ ద్వారా ఆర్ధిక పురోగతి కొరకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో 2021 నుండి 2025-26 సంవత్సరాల కాలపరిమితిలో ఔత్సాహిక రైతులను వ్యాపార సరళిలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ పధకం ద్వారా గొర్రెలు మరియు మేకలు పెంపకం, కోళ్లు పెంపంకం, పందులు పెంపకం, పశుగ్రాసం, దాణాతయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించి అసంఘటితంగా ఉన్న పశు సంవర్ధక రంగాన్ని వ్యవస్ధీకరణ రంగంలోకి తీసుకువచ్చి పాలు,గ్రుడ్లు,మాంసం ఉత్పత్తినిపెంచి వాటికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు గ్రామస్ధాయిలో నిరుద్యోగులకు, రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గొర్రెలు, మేకలు, ఫారము యూనిట్ 100 నుండి 500 వరకు సబ్సిడీ గరిష్టంగా రూ. 10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పధకాన్ని వినియోగించుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అవగాహన సదస్సుద్వారా తెలియజేస్తున్నట్లు ఆమె చెప్పారు. వీటిని అందరూ ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర షీ ప్ ఫెడరల్ చైర్మన్ ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంవర్ధక శాఖ ద్వారా జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పధకాన్ని 2021-26 సంవత్సరం వరకు వర్తింప చేస్తూ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఫిజికల్ గా యూనిట్ కలిగియున్నవారికి మాత్రమే పధకం వర్తిస్తుందని తెలిపారు. ఈ ఫారము ను పెట్టి మంచిగా ఉత్పత్తి పెరిగి ఆర్ధికంగా బలోపేతం అవుతారని అన్నారు. యూనిట్ తప్పక పెట్టాలని లేకపోతే 50 శాతం సబ్సిడీ రాదని స్పష్టం చేశారు. ఈ పధకంపై అవగాహన ప్రజలకు తెలిసే విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పధకానికి బ్యాంకులు కూడా ముందుకు వచ్చి రుణాలు అందజేయాలని కోరారు. ఈ వర్క్ షాపులో డా. కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ 65 సంవత్సరాల లోపు అందరూ ఈ పధకానికి అర్హులేనని పెరటికోళ్ల పెంపకం, నాటుకోళ్ల పెంపకం, పందులు పెంపకం, దాణ తదితర అంశాలపై వర్క్ షాపులో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పధకం కింద లోన్లుమంజూరు చేసిన బ్యాంకు అధికారులకు మెమెంటోను జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వెజ్జు వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా షీప్ ఫెడరేషన్ చైర్మన్ ఆకుల కృష్ణారావు, ఏలూరు డిడి టి. గోవిందరాజులు, ఎల్ డిఎం నీలాధ్రి, ఏ డి ఐ .ఎస్. డి. టి. బి ఎన్ వి లక్ష్మీనారాయణ వ్యవసాయ అభివృద్ధి కమిటీ మెంబర్స్ , ఆర్బికే కమిటీ మెంబర్స్, రైతులు, గొర్రెల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.