అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు నష్టం…
1 min readపల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : అధికారుల అవగాహన లోపంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మించిన కల్వర్టు వలన ఓ రైతు నష్టపోతున్న ఘటన వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం టెంకాయచెట్లపల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వంగిమల్ల నుండి రామాపురం, రాయచోటి వైపు వెళ్ళే రోడ్డుకు పక్కన ఎం.జనార్ధన్ రెడ్డి అనే రైతుకు చెందిన భూమి ఉంది. భూమి ఆనుకొని ఉన్న వంకకు ఆర్.అండ్.బి అధికారులు కల్వర్టు నిర్మాణానికి టెండర్లు పిలవడంతో పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులను చేపట్టడమే కాకుండా కల్వర్టు కు వంకకు మధ్యలో రక్షణ గోడ నిర్మించకపోవడంతో వరద నీరు కల్వర్టు కు పక్కనే ఉన్న భూమిని కోతకు గురిచేస్తూ వెళ్లడంతో నష్టపోతున్నానని రైతు వాపోతున్నాడు. కల్వర్టు నిర్మాణం సరిగ్గా చేపట్టకపోవడంతో తన భూమికి నష్టం కలుగుతోందని పలుమార్లు ఆర్.అండ్.బి అధికారులకు ఫిర్యాదు చేసినా కాంట్రాక్టర్ కు చెప్పినా వారు పట్టించుకోలేదంటూ రైతు జనార్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి రైతు పొలం కోతకు గురికాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.