రూ.1.61 కోట్ల నాబార్డు నిధులతో నూతన వసతి గృహ సముదాయం
1 min read– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో రూ.1.61 కోట్ల నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన వసతి గృహ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు.మంగళవారం ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన వసతి గృహ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, స్థానిక ప్రజప్రనిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదివి ఉన్నత స్థానాలలో ఉండడంతో పాటు ప్రతి సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లడం చాలా సంతోషకరం అన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన జూనియర్ కళాశాలు ఎన్నో ఉన్నాయని, అనంతరం వారు చేసే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు కూడా ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తూ జగనన్న విదేశీ విద్య ద్వారా టాప్ యూనివర్సిటీలలో విద్యను అభ్యసించే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. చదువు విషయంలో ప్రభుత్వం ఒకటవ తరగతి నుండి మొదలుకొని జీవితంలో స్థిరపడేంత వరకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లి చదువుకోవడానికైనా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పిస్తుందని అందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముగ్గురు కలిసి ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాన్ని ఉపయోగించుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం పాఠశాలకు ప్రహరీ గోడ అవసరమని జిల్లా కలెక్టర్ ను ప్రిన్సిపల్ కోరగా అందుకు స్పందిస్తూ ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా అనుమతులు వచ్చాయని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అదే విధంగా పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో అదనంగా నిర్మించిన వసతి గృహ సముదాయాన్ని రూ.1.61 కోట్ల నాబార్డు నిధులతో పూర్తి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసించాలానే ప్రధాన ఉద్దేశ్యంతో అమ్మఒడి లాంటి పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా విద్యార్థులకు అవసరమయ్యే స్కూల్ యూనిఫార్మ్స్, బ్యాగ్స్, షూస్ తదితర వాటిని అందివ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు బాగా చదువుకోవాలని వారికి సూచించారు. ముఖ్యంగా పిల్లలు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పటికీ గుర్తించుకోవాలని, అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, పెద్దలను గౌరవించాలన్నారు. ఈ పాఠశాల నుండి దేశంలోనే ఉత్తమ సేవలు అందించే స్థానాలలో ఈ పాఠశాల విద్యార్థులు ఉండడం చాలా గర్వకారణమన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించడం జరుగుతుందన్నారు. అదే విధంగా పాఠశాలలో ఉన్న సమస్యల గురించి ప్రిన్సిపల్ కోరగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు అందరికీ పౌస్టికహారం అందించాలనే లక్ష్యంతో గుడ్డు, వారానికి మూడు సార్లు రాగిజావ అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు ఎటువంటి కంటి సమస్యలు ఉన్న వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా కంటి పరీక్షలు చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన కంటి అద్దాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. నాడు-నేడు కింద పాఠశాల రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టి వారికి భవిష్యత్తును తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి రాష్ట్రం పేరు ఉన్నత స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థులు సంఘం ఎన్నో పనులు చేశారని అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా మార్కెట్ యార్డు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, విద్యార్థులు ఈ పాఠశాలలోనే ఇంటర్మీడియేట్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరగా అందుకు తగిన సాద్య సాధ్యాలను పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్.ప్రభాకర్ రెడ్డి, ఓర్వకల్లు సర్పంచ్ అనూష, ఓర్వకల్లు ఎంపిపి కె.తిప్పన్న, ఓర్వకల్లు జెడ్పీటిసి బి.రంగనాథ్ గౌడ్, కాల్వబుగ్గ సర్పంచ్ పెద్ద వెంకటేశ్వర్లు, ఓర్వకల్లు ఎంపిటిసి ఎస్.నాగి రెడ్డి, ప్రెసిడెంట్ కాల్వబుగ్గ జి.చెన్నారెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ జి.నాగతిరుపాల్, కాల్వబుగ్గ ఛైర్మన్ జి.చెన్నారెడ్డి, ఓర్వకల్లు తహశీల్దార్ సిహెచ్.శివప్రసాద్, ఎంపిడిఓ ఏ.శివనాగప్రసాద్, ఎస్ఎస్ఎ పిఓ వేణుగోపాల్, డిప్యూటీ డిఈఓ ఎన్.హనుమంత రావు, ప్రిన్సిపల్ మల్లిబాష, ఎంఈఓ వై.సునంద, తల్లిదండ్రుల కమిటీ ప్రెసిడెంట్ ఆర్.గిడ్డమ్మ, పూర్వవిద్యార్థి నాగ సుబ్బారాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.