కృష్ణా జలాల వినియోగంపై నూతన జీవో చీకటి జీవో
1 min read– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్లాక్ డే
– జీవో ఉపసంహరణ జరిగేటట్లుగా ముఖ్యమంత్రే స్వయంగా చర్యలు చేపట్టాలి
– మన హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలన్నీ గళమెత్తాలి రాయలసీమ హక్కులను కాలరాస్తున్న పాలకుల వైఫల్యాలపై త్వరలో కార్యాచరణబొజ్జా దశరథరామిరెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి హక్కులను హరించివేసే దిశగా భారతీయ జనతా పార్టీ దూకుడును అడ్డుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.సోమవారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రాల మద్య జల వివాదాలను పరిష్కరించడానికి రాజ్యాంగం, అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాలను పాలకులు ఏర్పాటు చేస్తే అదే పాలకులు ఈ చట్టాలను తూట్లు పొడుస్తూ,రాష్ట్రాల మద్య వివాదాలు సృష్టించైనా సరే కేవలం తమ రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 7 న విడుదల చేసిన జీవో ను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో లేని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎన్. జి. టి. స్టే విధించినా, నిరాఘాటంగా పనులు జరుపుకోవడానికి, అనేక నిర్మాణాలు పూర్తి అవ్వడానికి, ట్రైల్ రన్ చేసుకోవడానికి, జాతికి అంకితం చేయడానికి, పోలవరం ద్వారా ఆదా అయ్యే 45 టి ఎం సి. ల జలాలను ఎలాంటి హక్కులు లేకపోయినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరించిన అయన ద్వజమెత్తారు.ఈ అంశంపై సరైన సమయంలో, సరైన నిర్ణయాలు, సరైన వేదికపై తీసుకొని పోకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ లబ్దికోసం ఆంధ్రప్రదేశ్ సాగునీటి హక్కులను పణంగా పెట్టడం తీవ్రంగా వ్యతిరేకించకపోతే రాయలసీమకు భవిష్యత్తే లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.పోలవరం లేదా పట్టిసీమ ద్వారా ఆదా అయ్యే జలాలు పూర్తిగా రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించకపోతే, ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన రాయలసీమకు లబ్ది అటుంచి, ఇప్పుడున్న పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సాగునీటి హక్కులను తాకట్టుపెట్టే చర్యలను నిలవరించడానికి తక్షణమే చేపట్టాల్సిన నిర్ణయాలను ఆయన ప్రకటించారు.పోలవరం/పట్టిసీమ ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే జి.వో జారి చేయాలి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జి.వో. రద్దు కొరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీ కేంద్రంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. బచావత్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు పరిచేలాగా కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి చేసుకుని రావాలి. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న దుమ్ముగూడెం నాగార్జునసాగర్ సాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా కృష్ణా జలాల పై ఆధారపడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికరజలాలు కేటాయింపుల జరిపే కార్యక్రమం లేదా ఆ విధంగా వెసులుబాటు కలిగే లాగా ఇంకొక ప్రాజక్టు ద్వారా గోదావరి జలాలు మల్లించే జాతీయ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి అనుమతులు సాధించాలి.కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి. అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 ప్రకారం నీటి పంపకం తిరిగతోడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టాలి.రాష్ట్రం లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలకు అతీతంగా గళమెత్తాలని, అదే విధంగా ప్రజా సంఘాలు మనకు జరుగుతున్న అన్యాయాలపై క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.తమ రాజకీయ స్వార్థం కోసం రాయలసీమ హక్కులను తాకట్టు పెట్టే చర్యలను, పాలకుల వైఫల్యాలను ప్రజా క్షేత్రంలోకి తీసుకెల్లి ఎండగడుతామని దశరథరామిరెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి,కార్యవర్గ సభ్యులు కొమ్మా శ్రీహరి, మహేశ్వరరెడ్డి, పట్నం రాముడు, భాస్కర్ రెడ్డి, షణ్ముఖరావు, క్రిష్ణమోహన్ రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.