ఏపీలో రాత్రి కర్ఫ్యూ.. నిబంధనలు ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో రాత్రి కర్ఫ్యూకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. 18వ తేది నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయి. ఈనెల 31 వరకు అమలులో ఉంటాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుఝామున 5 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కొన్నింటికి రాత్రి కర్ఫ్యూ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వీటిలో ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే.. వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపటం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. మాస్క్ ధరించని వారికి రూ. 100 జరిమానా విధిస్తారు.