PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తొమ్మిదేళ్ల బాలుడికి అరుదైన నార్స్ (NORSE) వ్యాధి

1 min read

– క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా చికిత్స‌

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అత్యంత అరుదైన నార్స్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఒక బాలుడికి క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు డాక్ట‌ర్ శ్వేత రాంప‌ల్లి (పీడియాట్రిక్ న్యూరాల‌జీ) మరియు పీడియాట్రిక్ క్రిటిక‌ల్ కేర్ బృందం – డాక్ట‌ర్ నవీన్ రెడ్డి, డాక్ట‌ర్ వాసు, డాక్ట‌ర్ రవికిరణ్ స‌రైన స‌మ‌యానికి స‌రైన చికిత్స చేసి, అత‌డిని కాపాడారు. సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు వైద్య వ‌ర్గాల్లో కూడా పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఈ వ్యాధికి స‌రైన చికిత్స అందించ‌క‌పోతే ప్రాణాపాయం కూడా సంభ‌వించే ప్ర‌మాదం ఉంది. ఈ బాలుడి స‌మ‌స్య‌, అత‌డికి అందించిన చికిత్స వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన పీడియాట్రిక్ న్యూరాల‌జిస్టు డాక్ట‌ర్ శ్వేత రాంప‌ల్లి తెలిపారు.  “క‌ర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తొమ్మిదేళ్ల దీప‌క్‌.. నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఉన్న‌ట్టుండి నాలుగుసార్లు మూర్ఛ‌, ఒక‌రోజు జ్వ‌రం వ‌చ్చాయి. దాంతో కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. త‌ర‌చు మూర్ఛ వ‌స్తుండ‌టం, స్పృహ కోల్పోవ‌డంతో అత‌డిని వెంటిలేట‌ర్ మీద పెట్టారు. సీఎస్ఎఫ్‌, ఎంఆర్ఐ లాంటి ప‌రీక్ష‌ల‌లో మెదడువాపు వ్యాధి లేద‌ని తెలిసింది. అయినా అత‌డికి మూర్ఛ త‌గ్గ‌లేదు. దాంతో మందుల ద్వారా అత‌డిని తాత్కాలికంగా కోమాలోకి పంపాము. ఈఈజీ ప‌రీక్ష‌లు, ఇత‌ర ల‌క్ష‌ణాల ఆధారంగా అత‌డికి వ‌చ్చిన‌ది నార్స్ (న్యూ-ఆన్‌సెట్ రిఫ్రాక్ట‌రీ స్టేట‌స్ ఎపిలెప్టిక‌స్‌) అయి ఉంటుంద‌ని అనుమానించాం. వెంట‌నే ఇమ్యునోథెర‌పీ స‌హా దానికి సంబంధించిన చికిత్స ప్రారంభించాం. దాతో నెమ్మ‌దిగా అత‌డికి మూర్ఛ త‌గ్గ‌సాగింది. ఖచ్చితమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులు హాస్పిటల్-అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడింది. అద్భుతమైన నర్సింగ్, ఫిజియోథెర‌పీ, న్యూట్రిష‌న్ నిపుణుల సాయంతో ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. మొత్తం 6 వారాల పాటు ఆస్ప‌త్రిలో ఉండి చికిత్స పొందాల్సి వ‌చ్చింది. అత్యంత అనిశ్చితితో కూడిన ఈ అరుదైన స‌మ‌స్య విష‌యంలో భ‌విష్య‌త్తులో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను కూడా అత‌డి త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించాం. నార్స్ (న్యూ-ఆన్‌సెట్‌ రిఫ్రాక్టరీ స్టేటస్ ఎపిలెప్టికస్) అనేది అరుదైన, ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి.  ఇది పూర్తి ఆరోగ్యవంతులైన‌ పిల్లలు, యువకులలో అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఈ అరుదైన వ్యాధిపై అవగాహన సాధారణ ప్రజలతో పాటు వైద్యుల్లో కూడా చాలా తక్కువ. ఈ వ్యాధి రావ‌డానికి స్పష్టమైన కారణం తెలియదు. దీనికి దీర్ఘకాలిక నాన్యతమైన క్రిటికల్ కేర్, న్యూరోలాజికల్ కేర్ చికిత్స‌లు అవ‌స‌రం అవుతాయి. జీవ‌న‌రీతిని పూర్తిగా మార్చేసే న్యూరోలాజిక‌ల్ ప్ర‌భావాలు, మందుల‌కు లొంగ‌ని మూర్ఛ‌, లేదా మ‌ర‌ణానికి కూడా ఇది కార‌ణం కావ‌చ్చు. దీనికి మూర్ఛ‌ను నివారించే ప‌లు ర‌కాల మందుల‌తోపాటు, క్ర‌మం త‌ప్ప‌కుండా పీడియాట్రిక్ న్యూరాల‌జీ ప‌రీక్ష‌లు చేయిస్తుండాలి. ముందస్తుగా గుర్తించి, తగిన చికిత్సను త్వ‌రగా ప్రారంభిస్తే ప్రాణాలను కాపాడచ్చు”  అని డాక్ట‌ర్ శ్వేత రాంప‌ల్లి మరియు డాక్ట‌ర్ నవీన్ రెడ్డి వివ‌రించారు.

About Author