PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేని పక్షంలోఉద్యోగులు ఉద్యమ బాట..

1 min read

విలేకరుల సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేని పక్షంలో రేపటి (14వ తేదీ ) నుంచి ఉద్యమ బాట పట్టనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం స్థానిక పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘ భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్స్ , ఏపీ జిఎల్ఐ, జిపిఎఫ్, డిఏ ఏరియర్స్, 11వ పిఆర్సి కి సంబంధించిన ఏరియర్స్ బకాయిలు 23 వేల కోట్లరూపాయలకు పైగాఉన్నాయని వాటిపై నుంచి ఎటువంటి స్పందన లేదని అన్నారు. బకాయిలు చెల్లించని పక్షంలో ప్రభుత్వం పై ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తారని తెలిపారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాని పక్షంలో ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటామని హెచ్చరించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు. జేఏసీ కన్వీనర్ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలను వెంటనే పరీక్షించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈసమావేశంలో నాయకులు కప్పల సత్యనారాయణ, బండి వెంకటేశ్వరరావు, శ్రీధర్ రాజు, బేగ్, మహిళా ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

About Author