ఇక నుంచి నో సర్వీస్ చార్జీ !
1 min readపల్లెవెలుగువెబ్ : హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీ బాదుడు నుంచి వినియోగదారులకు ఊరట లభించనుంది. దీనికి సంబంధించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ రంగంలోకి దిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లులో ఆటోమెటిగ్గా లేదా డీఫాల్ట్‌గా సర్వీస్ చార్జీని విధించకుండా నిషేధించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఈమేరకు సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం.. హోటళ్లు లేదా రెస్టారెంట్లు సర్వీస్ చార్జీని చేర్చరాదు. మరే ఇతర పేరుతోనూ సేవా చార్జీని వసూలు చేయకూడదు. సర్వీస్ చార్జీని చెల్లించాలని వినియోగదారున్ని బలవంతం చేయరాదు. సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందం, ఐచ్ఛికం, వినియోగదారు ఇష్టమని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలి.