PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నకిలీ, కల్తీలపై నిఘా ఏదీ?

1 min read
(ఫైల్​)

(ఫైల్​)

  • నందికొట్కూరు జోరుగా కల్తీ, నకిలీ దందా…
    రైతులకు పొంచి ఉన్న నకిలీ విత్తనాల బెడద..

– నందికొట్కూరు జోరుగా కల్తీ, నకిలీ దందా…
– రైతులకు పొంచి ఉన్న నకిలీ విత్తనాల బెడద..
– కట్టడి చేయని సంబంధిత శాఖల అధికారులు..
– అడపాదడపా తనిఖీలే తప్ప కఠిన చర్యలు శూన్యం..
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు : జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలో కల్తీ, నకిలీ దందా జోరుగా సాగుతోంది. అరికట్టాల్సిన సంబంధిత శాఖ అధికారులు మాత్రం కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా ప్రతీయేటా నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతుండగా.. కల్తీ సరుకులతో ప్రజలు ధీర్ఘకాలీక రోగాల బారిన పడుతున్నారు. నిత్యవసర సరుకులు, వస్తువులను కల్తీ చేసే కల్తీ, నకిలీగాళ్ల తాట తీస్తామని ఆరంభంలో అధికారులు పలు దుకాణాలు, గోదాంలు, ఏజెన్సీలపై దాడు లు చేసి హడావుడి చేశారే తప్ప ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.

రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద..
నందికొట్కూరు పట్టణ పరిధిలో విత్తనాలు, ఎరువులను కల్తీ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ప్రతీయేటా నకిలీ పత్తి, మొక్కజొన్న విత్తనాలను రైతులకు అంటగడుతుండటంతో దిగుబడి రాక పెట్టుబడిపై అప్పులు తెచ్చి వాటిని కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నందికొట్కూరు పట్టణంలో వ్యవసాయ అధికారులు గతంలో కొన్ని దుకాణాలలో దాడులు నకిలీ విత్తనాలను ,ఎరువులను గుర్తించారు. కల్తీ ఎరువులు, విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులు దాడులు చేశారే తప్ప ఏ ఒకరిపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. రబీ సీజన్ రానుండడంతో కంది,మినుము, శనగ ను రైతులు విస్తారంగా సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాలను మార్కెట్‌లో తెచ్చేందుకు కల్తీగాళ్లు మాటు వేసినట్లు సమాచారం. ఇలా ఎరువులు, విత్తనాలనే కాకుండా చివరకు పెట్రోల్‌, డిజిల్‌ కూడా వదలడం లేదు. గతంలో పట్టణంలోని కర్నూలు రహదారి ప్రక్కన ఉన్న ఓ పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్‌, డిజిల్‌ పోస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. కానీ సంబంధిత శాఖ అధికారులు ఇప్పటి వరకు ఆ పెట్రోల్‌ బంకు యజమానులపైన కేసు నమోదు చేయకుండానే వదిలేశారు. అదే విధంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పాస్ట్‌పూడ్‌ సెంటర్లలో నాసీరకం ఆహార పదార్థాలను తయారు చేస్తూ వినియోగదారులకు వడ్డిస్తున్నట్లు గతంలో పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. ఏ ఒక్క హోటల్లో పుడ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జోరుగా కల్తీ నూనె వ్యాపారం…


కల్తీ నూనె వ్యాపారం జోరుగా సాగుతుందని ప్రజల నుంచి విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా పట్టణంలో పలువురు వ్యాపారులు మంచి నూనెను , కొబ్బేరి నూనెను కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లు తెలుస్తోంది. నందికొట్కూరు పట్టణంలో పారాచూట్ కొబ్బేరి నూనెను పోలిన నకిలీ నూనెను అమ్ముతున్నముఠాను నందికొట్కూరు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. కర్నాటక, మ హారాష్ట్ర , హైదరాబాద్‌ కేంద్రంగా కల్తీ నూనె వ్యాపారం భారీగా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న జిల్లా పోలీసు అధికారులు గత నెలలో తయారీ ముఠాను అదుపులోకి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి.
కల్తీ కట్టడిలో అధికారుల విఫలం…
జిల్లాలో కల్తీ, నకిలీల వ్యాపారాలను కట్టడి చేయడంలో అధికారులు తీవ్రంగా విఫలమవుతున్నారు. ప్రభుత్వ అదేశాలతో గతంలో దుకాణాల్లో, గోదాంలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన కల్తీ సరుకుల నమూనాలను పరీక్ష నిమిత్తం పంపించారు. కానీ కల్తీ విత్తనాల వ్యాపారం చేసే వ్యాపారులపై సంబందిత శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి. దీనితో పట్టణంలో పుట్టగొడుగుల్లా విత్తనాలు, మందుల దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. నామమాత్రపు తనిఖీలు చేసి జరిమానాలు విధించి వదిలేస్తున్నారే తప్ప కఠిన చర్య లు తీసుకున్న సంఘటనలు లేకపోయాయని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే వ్యాపారులు, రాజకీయ వర్గాల నుంచి ఒత్తిడిలు రావడంతోనే ఎరువులు,విత్తనాలు,పురుగుల మందు దుకాణాల పైనా దాడులు నిలిపివేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది వ్యాపారులు కింగ్ మేకర్ గా వ్యహహరిస్తూ అధికారులకు భారీగా ముడుపులు ముట్టచెప్పుతున్నారనే ఆరోపణలున్నాయి.

About Author