ఏడో నెలలో కవలల సాధారణ ప్రసవం
1 min read* 770 గ్రాములు, 940 గ్రాముల బరువుతో పిల్లలు
* పలు రకాల ఆరోగ్య సమస్యలు
* రెండు నెలల చికిత్సతో నయం చేసిన కిమ్స్ కడల్స్ వైజాగ్ వైద్యులు
పల్లెవెలుగు, విశాఖపట్నం: గర్భంలో కవలలు ఉన్నప్పుడు సాధారణ ప్రసవాలు జరగడమే కష్టం. అలాంటిది ఏడో నెలలోనే కవల పిల్లలిద్దరూ సాధారణ ప్రసవంలో పుట్టి, తక్కువ రోజుల చికిత్సతోనే పూర్తిగా నయమైన సందర్భమిది. విశాఖపట్నంలోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స కడల్స్ వైజాగ్ ఆస్పత్రికి చెందిన చీఫ్ నియోనాటాలజిస్టు, నియోనాటాలజీ విభాగాధిపతి డాక్టర్ నిఖిల్ తెన్నేటి మరియు గైనకాలజిస్ట్ డా. శిల్పారెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే…
పిల్లలిద్దరికీ.. సమస్యలు…!
“పిల్లలిద్దరిలోనూ మొదటి శిశువు కేవలం 770 గ్రాముల బరువుతో పుట్టింది. శ్వాస సరిగ్గా అందకపోవడం, రక్తంలో చక్కెరశాతం అధికంగా ఉండటం, ముందుగానే పుట్టడం వల్ల ఏర్పడిన రక్తహీనత, మధ్యమధ్యలో ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఈ శిశువుకు ఉన్నాయి. రెండో శిశువు బరువు 940 గ్రాములు. దాదాపు ఇవే సమస్యలు ఈ శిశువుకు సైతం ఉన్నాయి. వీటికి సంబంధించిన సమగ్ర చికిత్సలు చేస్తూ, ఎప్పటికప్పుడు పిల్లల బరువు చూసుకుంటూ, వారికి కావల్సిన ఆహారం అందేలా చూసుకున్నాము. అయితే, అదృష్టవశాత్తు ఇలా నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో కనిపించే తీవ్రమైన సమస్యలు.. అంటే పీవీఎల్, ఎన్ఈసీ, ఐవీహెచ్, బీపీడీ లాంటివి ఈ ఇద్దరిలో లేకపోవడం బాగా కలిసొచ్చింది. ఎన్ఈసీ.. లేదా నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ అనే సమస్య ఉంటే.. పేగుల్లో కణజాలాలు మరణిస్తాయి. దీనివల్ల పేగుల్లో రంధ్రం పడి, బ్యాక్టీరియా లీకవుతుంది. ఐవీహెచ్ ఉంటే మెదడులో అంతర్గత రక్తస్రావం సంభవించి తీవ్రమైన సమస్యకు కారణమవుతుంది. బ్రాంకోపల్మనరీ డిస్‌ప్లేషియా (బీపీడీ) ఉంటే దీర్ఘకాలంపాటు శ్వాసకోశ సమస్యలు వస్తాయి. పెరివెంట్రిక్యులర్ లుకోమలేషియా (పీవీఎల్) అనే సమస్య వస్తే మెదడులో ఉండే తెల్లటి కణజాలం మృదువుగా మారిపోతుంది. మెదడు కణజాలానికి తగినంత రక్తసరఫరా లేకపోతే ఈ సమస్య వస్తుంది. నెలలు నిండని శిశువుల్లో ప్రధానంగా వచ్చే ఈ సమస్యలతో పాటు సెప్సిస్ కూడా లేకపోవడంతో ఒక శిశువును 54 రోజులు, మరో శిశువును 61 రోజులు మాత్రమే ఎన్ఐసీయూలో ఉంచి, ఇద్దరూ తగినంత బరువు పుంజుకునేవరకు అవసరమైన చికిత్సలు చేసి డిశ్చార్జి చేశాం. ఎన్ఐసీయూలో ఇంకా డాక్టర్ సంతోష్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మనోజ్, కిమ్స్ కడల్స్ నర్సింగ్ బృందం పిల్లలిద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గైనకాలజిస్టు డాక్టర్ శిల్పారెడ్డి సాయంతో ఈ పిల్లలిద్దరూ సాధారణ ప్రసవంలోనే పుట్టడం విశేషం” అని డాక్టర్ నిఖిల్ తెన్నేటి వివరించారు.