అంబులెన్సు కాదు.. ఇది పిల్లలకు ప్రాణదాత!
1 min read
నియోనాటల్ ఐసీయూ అంబులెన్సును ప్రారంభించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఇంక్యుబేటర్‌తో కూడిన ప్రత్యేక అంబులెన్సు
రాయలసీమలో తొలిసారి.. ఎక్కడినుంచైనా నవజాత శిశువులను తరలించగలం
కన్సల్టెంట్ నియోనాటాలజిస్టు డాక్టర్ హెచ్ఏ నవీద్ వెల్లడి
పల్లెవెలుగు ,కర్నూలు: నవజాత శిశువులకు ఏమైనా తీవ్రమైన సమస్యలు వచ్చి, వారిని పెద్ద ఆస్పత్రికి తరలించాల్సి వచ్చినప్పుడు అంబులెన్సులో తగిన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది అవుతుందని, అలాంటి పిల్లలందరికీ ప్రాణదాత లాంటి ఒక సరికొత్త అంబులెన్సును కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ప్రారంభించడం ఒక నవశకమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలులోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యంత అధునాతనమైన నియోనాటల్ అంబులెన్సు సర్వీసులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాయలసీమ పరిధిలోని ఎక్కడైనా పుట్టిన పిల్లలకు తీవ్ర సమస్యలుంటే వారిని ఇంక్యుబేటర్‌లో పెట్టడం, అవసరమైతే మరింత అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ.. అత్యంత సురక్షితంగా పెద్ద స్థాయి ఆస్పత్రులకు తరలించడం దీనివల్ల సాధ్యమవుతుందని చెప్పారు. ఇలాంటి సేవలు అందిస్తున్నందుకు కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని, యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ హెచ్ఏ నవీద్ మాట్లాడుతూ, నవజాత శిశువులలో కొంతమందికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడుతుందని, అలాంటి సందర్భాలు ఎంత మారుమూల ప్రాంతంలో తలెత్తినా వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెద్ద ఆస్పత్రులకు తీసుకురావడానికి ఈ అత్యాధునిక అంబులెన్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందులో అత్యంత అధునాతనమైన ఇంక్యుబేటర్, వెంటిలేటర్, ఆక్సిజన్ లాంటి సదుపాయాలు ఉన్నాయని వివరించారు. అవసరమైతే ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వాలన్నా కూడా ఇందులో సిద్దంగా ఉంటాయని, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల ప్రాణాలను కాపాడుతూ తీసుకురాగలరని తెలిపారు. ఇంతకుముందు పెద్దలకు మాత్రమే పోర్టబుల్ వెంటిలేటర్‌తో కూడిన అంబులెన్సులు ఉండేవని, పిల్లలకు ఇలాంటి సమగ్ర సదుపాయాలతో కూడిన అంబులెన్సు ఏర్పాటుచేయడం రాయలసీమలో ఇదే తొలిసారని ఆయన అన్నారు. ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ సేపూరి మాట్లాడుతూ, కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్య సదుపాయాలను రోగులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని, అందులో భాగంగానే ఇప్పుడు ఈ అధునాతనమైన అంబులెన్సును ప్రవేశపెట్టామని అన్నారు. రాయలసీమ వాసులకు ఇది ఒక వరం లాంటిదని, దీనివల్ల ఇక నవజాత శిశువులను తరలించాల్సి వస్తే ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. నెలలు నిండకముందే పుట్టే పిల్లల్లో అనేక సమస్యలు వస్తాయని, అలాంటప్పుడు వారిని పెద్ద ఆస్పత్రులకు తరలించాల్సి వస్తే ఇలాంటి అంబులెన్సులు ఉండడం చాలా అవసరమని తెలిపారు. ఇప్పుడు ఇది అందుబాటులో ఉండడంతో నవజాత శిశవుల తల్లిదండ్రులు భరోసాగా ఉండవచ్చని అన్నారు. ఇది పిల్లలకు, నవజాత శిశువులకు, గర్భిణులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని ఆయన వివరించారు.పిడియాట్రిక్ డాక్టర్లు డాక్టర్ జి. సుధాకర్, డాక్టర్ రఫిక్, డాక్టర్ గోవర్దన్, డాక్టర్ భారతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
