PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హక్కుల కోసం ఉద్యమిస్తే నోటీసులా … ఏపీటీఎఫ్

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  విజయవాడలో ఈనెల 18 వ తేదీన ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారు తలపెట్టిన ఓటు పర్  ఓపీయస్ కార్యక్రమంలో పాల్గొనకూడదని ఉద్యమ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చి నిర్బంధించడం తగదని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి. శ్రీనివాసులు, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సాంబశివుడు పేర్కొన్నారు. శనివారం గడివేముల మండల పోలీసులు మండలంలో పనిచేస్తున్న ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగరి శ్రీనివాసులకు అలాగే మండల శాఖ ప్రధాన కార్యదర్శి మానపాటి రవికి ముందస్తు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ప్రజాసంకల్ప యాత్రలో తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని, సకాలంలో డిఏలు, మెరుగైన పీఆర్సీ ఇస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారని అయితే అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత సీపీఎస్ కంటే దుర్మార్గమైన జీపీఎస్ విధానం తీసుకోని రావడం సీపీఎస్ ఉద్యోగుల దురదృష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో శాంతియుతంగా జరిగే కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు ఎందుకు నోటీసులు ఇస్తున్నారో అర్థం కావడం లేదని వారు అన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్, జీపీఎస్ లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అలాగే ఉపాధ్యాయ నియామకాలలో అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అని తక్షణమే అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్. మహబూబ్ బాషా, ఎ. నాగన్న, జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్. బాలస్వామి, మానపాటి రవి తదితరులు పాల్గొన్నారు.

About Author