PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృష్ణా జలాల పునః పంపిణీ నోటిఫికేషన్ ఏపీకి తీరని నష్టం

1 min read

బి.జె.పి., వై.కా.పా.లు రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు… పి రామచంద్రయ్య                         

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కృష్ణా జలాల పున :పంపిణీ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి రామచంద్రయ్య ఆరోపించారు. ఈనెల 20, 21వ తేదీలలో విజయవాడలో కృష్ణ జలాల పున: పంపిణీ నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ, సిపిఐ చేపట్టబోయే  30 గంటలు నిరసన దీక్ష జయప్రదం చేయాలని పత్తికొండలో బుధవారం స్థానిక చదువు రామయ్య భవన నందు గోడపత్రికలు విడుదల చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి రామచంద్రయ్య సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్ గురుదాస్ తో కలిసి గోడ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం సిపిఐ రాష్ట్రకార్యదర్శి పి.రామచంద్రయ్యమాట్లాడారు. సాగునీటి రంగానికి బిజెపి, వైకాపా ప్రభుత్వాలు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. రాష్ట్రానికి వరప్రసాదని లాంటి జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారిందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లు ఎత్తుకు పెంచుతూ ఉన్నందున  అదనంగా 130 టీఎంసీల కృష్ణా జలాలు క్రిందికి రాకుండా ఆల్మట్టి రిజర్వాయర్ లోనే నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచేే విషయమై వైకాపా ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ఉపనది అయిన భద్ర నది మీద 29.5 టీఎంసీల సామర్థ్యంతో అప్పర్ భద్ర ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించడమే కాకుండా 5300 కోట్ల రూపాయల గ్రాంట్ ప్రకటించిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలోని K.C కెనాల్, తుంగభద్ర లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ క్రింద 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందదని తెలిపారు. ఈ చర్య పై జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా 155 టీఎంసీల సామర్థ్యం గల పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, వాటర్ గ్రిడ్ ఎత్తిపోతల పథకాలను నీటి కేటాయింపు లేకుండా, అనుమతులు లేకుండా శరవేగంగా నిర్మిస్తోందని అన్నారు. ఇవి పూర్తయితే కృష్ణానది మీద ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులన్ని నిరుపయోగం అయిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా జగన్ ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతుందన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నివేదిక అమలు అయితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా అనుమతులు రాకుండా స్టే  తెచ్చిందని అన్నారు. ఆ స్టే ని ఎత్తివేయమని మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం దారుణం అన్నాారు. జగన్ ప్రభుత్వం తన సొంత కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు   తాకట్టుపెడుతూ జీ హూజూర్ అంటూ మోడీకి మద్దతు ఇస్తున్నాడని విమర్శించారు. వీటన్నింటికి పరాకాష్టగా  06-10-2023 కృష్ణా జలాల పునః పంపిణీకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు విధివిధానాలను నిర్ణయిస్తూ, మోడీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరమని అన్నారు.ఈ కారణాలవల్ల రాబోవు రోజులలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నదికి సంబందించి నికర జలాలు రావు, మిగులు జలాలు రావు, పర్యవసానంగా కర్నూల్ అనంతపురం, చిత్తూరు, కడప నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలలో 56 లక్షల ఎకరాల సాగు భూమి బీడు భూములుగా మారే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.కృష్ణా నదిపై రాష్ట్రంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్, కుడి, ఎడమ కాలువలు, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, ఎస్సార్ బీసీ, వెలిగొండ, కేసీ కెనాల్, తుంగభద్ర లో లెవెల్ కెనాల్, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ మొత్తం 10 ప్రాజెక్టులు నిరుపయోగం అయిపోతాయని తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రం  ఎడారి కాబోతుందని, అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్ర ప్రదేశ్ అన్నమో రామచంద్రా అని అలమటించాల్సిన పరిస్థితి దాపురిస్తుందని  అన్నారు. అలాగే తాగునీటికి కటకట ఏర్పడుతుందన్నారు.దాహమో లక్ష్మణా అని ఆర్తనాదాలు వినిపిస్తాయని చెప్పారు. పరిశ్రమలకు నీళ్లు లేక, ఉన్న పరిశ్రమలు మూతపడతాయని అన్నారు. కొత్త పరిశ్రమలు రావు, జలవిద్యుత్ ఉత్పత్తి కాక రాష్ట్రం చీకటి ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నారు.రోమ్ నగరం తగలబడి పోతూ ఉంటే, నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నట్లుంది మన ముఖ్యమంత్రి వైఖరి అని ఆయన  దుయ్యబట్టారు. ఇప్పటికైనా స్వార్థ ప్రయోజనాలు పక్కనపెట్టి. రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకొని రాజకీయ, న్యాయ పోరాటాలు వెంటనే మొదలు పెట్టాలని హితవు పలికారు. లేదంటే రాష్ట్ర ద్రోహిగా చరిత్రహీనుడిగా జగన్ నిలిచిపోతాడని పి రామచంద్రయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ మండల సహాయ కార్యదర్శి రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు నాగరాజు, నరసింహులు, నాగిరెడ్డి, కౌలుట్ల తదితరులు పాల్గొన్నారు.

About Author