ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నర్సుల వాకథాన్
1 min read
హైదరాబాద్, న్యూస్ నేడు : వైద్య చికిత్సలు అందించే విషయంలో నర్సుల పాత్ర ఎనలేనిది. వారు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా.. “మనం కలిసి నయం చేద్దాం” అనే థీమ్‌తో నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నర్సుల వాకథాన్ నిర్వహించారు. అంతర్జాతీయ నర్సింగ్ డేను పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి ప్రాంగణం నుంచి అమీర్ పేట వరకు జరిగిన ఈ వాకథాన్‌లో ఆస్పత్రికి చెందిన 60 మందికి పైగా నర్సులు పాల్గొన్నారు. “ఒక్క సాధికార నర్సు.. వందలకొద్దీ ఆరోగ్యవంతమైన జీవితాలు” అనే థీమ్‌తో ఈ వాకథాన్ జరిగింది. వైద్యరంగ నిపుణులు, పేషెంట్లు, సాధారణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమం చూసి నర్సులపాత్ర గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ లిండమోల్ జాయ్ మాట్లాడుతూ, “పేషెంట్లు ఆస్పత్రిలో ఉన్నంతసేపూ, ముఖ్యంగా ఐసీయూ లాంటిచోట్ల నర్సులు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పేషెంట్లకు ఎన్నో సేవలు చేస్తారు. ఆస్పత్రిలో మొట్టమొదట స్పందించేది, చిట్టచివరగా వెళ్లేది నర్సులే. రోగి కోలుకోవడంలో వీరి పాత్ర చాలానే ఉంటుంది. రోజంతా శ్రమిస్తూ, అపారమైన నిబద్ధత కనబరిచే నర్సుల సేవలను గుర్తించడంతో పాటు.. ప్రజలకు ఈ అంశంపై తగిన అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ వాకథాన్ నిర్వహించాం” అని తెలిపారు.