వెంటిలేటర్ పెట్టిన తర్వాత మూసుకుపోయిన శ్వాసనాళం
1 min read* మహిళకు ఊపిరి అందక.. ప్రాణాంతక పరిస్థితి
* అత్యవసర శస్త్రచికిత్సతో ప్రాణాలు నిలబెట్టిన కిమ్స్ సవీరా వైద్యులు
* వెయ్యిలో ఒకరి నుంచి 10 మందికి మాత్రమే ఇలాంటి సమస్య
పల్లెవెలుగు వెబ్ అనంతపురం :వెంటిలేటర్ అమర్చడం వల్ల శ్వాసనాళం పూడిపోయి దాదాపు ఊపిరి అందని ఓ మహిళకు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి చెందిన వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన పల్మనాలజిస్టు డాక్టర్ యశోవర్ధన్ తెలిపారు. “అనుకోకుండా విషం మింగడంతో 30 ఏళ్ల వయసున్న ఓ మహిళకు బెంగళూరులోని ఆస్పత్రిలో వెంటిలేటర్ అమర్చారు. దాదాపు వారం రోజుల పాటు అలాగే వెంటిలేటర్ మీద ఉన్న తర్వాత ఆమె పరిస్థితి అంతా బాగుండటంతో డిశ్చార్జి చేసి పంపేశారు. అక్కడి నుంచి వచ్చేసిన రెండు నెలల తర్వాత ఆమెకు ఊపిరి అందడం కష్టంగా మారింది. చివరకు కూర్చున్నా ఊపిరి అందకపోవడం, గురక, దగ్గు బాగా ఎక్కువ కావడంతో ఆమె కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ముందుగా ఆమెకు మెడకు ఎక్స్ రే తీసి చూడగా.. శ్వాసనాళం బాగా మూసుకుపోయినట్లు కనిపించింది. మరింత వివరంగా తెలుసుకోవడానికి బ్రాంకోస్కొపీ అనే పరీక్ష చేసి గొంతులోకి కెమెరా పంపించి చూడగా.. 12 మిల్లీమీటర్ల మేర ఉండాల్సిన శ్వాసనాళం కేవలం 3 మిల్లీమీటర్లు మాత్రమే ఉండి.. మిగిలినదంతా పూడిపోయింది. ఈ పూడిక వోకల్ కార్డ్స్‌కు 4 సెంటీమీటర్ల దిగువన ఏర్పడింది. దీంతో ఆమెకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి, జనరల్ ఎనస్థీషియాతో శస్త్రచికిత్స ప్రారంభించాం. ముందుగా ఎలక్ట్రోకాటెరీ అనే విధానంలో పూడిపోయిన శ్వాసనాళానికి కోత పెట్టాం. దాంతో 6 మిల్లీమీటర్ల స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత లోపలకు బెలూన్లు పంపి, వాటి ద్వారా శ్వాసనాళాన్ని మరింతగా వెడల్పు చేసి, మొత్తం 12 మిల్లీమీటర్ల స్థాయికి తీసుకొచ్చాం. ఈ శస్త్రచికిత్స తర్వాత ఆమెకు ఊపిరి సాధారణంగా అందడంతో పాటు, దగ్గు.. గురక కూడా తగ్గడంతో ఆమెను మర్నాడు డిశ్చార్జి చేశాం.
శ్వాసనాళంలో పూడికలు ఎందుకు?
సాధారణంగా కేన్సర్‌కు రేడియేషన్ చికిత్స తీసుకోవడం, లేదా ఎక్కువ కాలం పాటు వెంటిలేటర్ మీద ఉండటం వల్ల శ్వాసనాళంలో ఇలా పూడికలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగని వెంటిలేటర్ పెట్టించుకున్న అందరికీ ఇలాంటి సమస్య రాదు. ప్రతి వెయ్యి మందిలో 1 నుంచి 10 మందికే ఇలా పూడికలు ఏర్పడతాయి. దీనికి జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. సమస్య తీవ్రతను బట్టి వారికి తీవ్రంగా ఆయాసం రావడం, గురక, దగ్గు లాంటి సమస్యలు ఏర్పడతాయి. అలాంటప్పుడు మొదట్లోనే వైద్యులను సంప్రదించాలి. ఒక్కోసారి శ్వాసనాళం పూర్తిగా పూడుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అప్పుడు ప్రాణాపాయం ఏర్పడుతుంది. అందువల్ల వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స చేయించుకోవాలి” అని డాక్టర్ యశోవర్ధన్ వివరించారు.