PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులు స్థానికంగా నివాసం ఉండాలి

1 min read

– అత్యవసర సేవల్లో తక్షణమే స్పందించాలి
– ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో స్పందన సమస్యలు పరిష్కరించాలి
– 90 శాతం ఫిర్యాదులు సచివాలయాల్లోనే పరిష్కారం కావాలి
– జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: అధికారులు తాము పని చేస్తున్న కేంద్రంలో స్థానికంగా నివాసం వుండాలని జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి, ఇంచార్జి డిఆర్ఓ కామేశ్వరరావు తదితరులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తాము పని చేస్తున్న కేంద్రంలో స్థానికంగా నివాసం వుంటూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రధాన కేంద్రం వదిలి వెళ్లాల్సి వస్తే పై అధికారుల ముందస్తు అనుమతి తీసుకుని వెళ్లాలన్నారు. తమ పరిధిలోని ఏదైనా సంఘటన జరిగితే సంబంధిత వివరాలు జిల్లా కేంద్రానికి పంపడంతో పాటు తక్షణ చర్యలు గైకొనాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై గతంలో కూడా చెప్పడం జరిగిందని…. ఇందుకు సంబంధించి సర్కులర్ జారీ చేయాలని డిఆర్వోను కలెక్టర్ ఆదేశించారు.స్పందన సమస్యల నాణ్యత పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా ఆదేశాలు వచ్చాయని… స్పందన గ్రీవెన్స్ ను సీరియస్ గా తీసుకొని ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో స్పందన సమస్యలు పరిష్కరించాలన్నారు. అర్జీదారునికి ఇచ్చే ఎండార్స్మెంట్ గాని స్పీకింగ్ ఆర్డర్స్ కానీ ఫిర్యాదుదారునికి ఖచ్చితంగా చేరేలా వుండాలన్నారు. ప్రతి సచివాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించి అర్జీ దారుల నుండి దరఖాస్తులు స్వీకరించేలా ఎంపీడీవోలు దృష్టి సారించాలన్నారు. జిల్లా కేంద్రానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయంటే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని స్పష్టమవుతోందని.. 90 శాతం ఫిర్యాదులు సచివాలయాల్లోనే పరిష్కారం కావాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు
1)పాములపాడు మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన సి. సార అనే మహిళ 30.10.2018 తేదీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లను కాన్పు అయ్యానని నా బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తే బడికి, రేషన్ కార్డు, అమ్మ ఒడి తదితర ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగకరంగా ఉంటుందని….కావున దయచేసి నా బిడ్డ కు బర్త్ సర్టిఫికేట్ ఇప్పించగలరని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.

2) పాణ్యం మండల కాపురాస్తురాలు లక్ష్మీదేవికి మేకలబండ జగనన్న కాలనీలో స్థలం కేటాయించారని… కానీ మా ప్లాట్ మీదుగా విద్యుత్ తీగలు వెళ్ళటం వలన బెయిల్దార్లు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రావటం లేదని మా సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో 182 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author