ఉల్లి రేట్లు పెరుగుతాయట.. ముందే కొనిపెట్టుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఉల్లిపాయలు ఘాటెక్కనున్నాయా ?. ధరలు సామాన్యుడి జేబు గుల్ల చేయనున్నాయా ?. అంటే అవుననే సమాధానం ఇస్తోంది ప్రముఖ మార్కెట్ రీసర్చ్ సంస్థ క్రిసిల్. మన దేశంలో ప్రతి నెల 13 లక్షల టన్నుల ఉల్లి వినియోగం జరుగుతోంది. అధికంగా మహారాష్ట్ర నుంచి.. ఆ తర్వాత ఆంధ్ర, కర్నాటక నుంచి ఉల్లి దేశ వ్యాప్తంగా సరఫరా అవుతోంది. తౌటౌ తుఫాను కారణంగా మహారాష్ట్ర, కర్నాటకలో ఉల్లిపాయల సాగు ఆలస్యమైందని, ప్రస్తుత వర్షాలతో ఉల్లి పంట చేతికొచ్చే సమయం ఆలస్యం అవుతుందని క్రిసిల్ అభిప్రాయపడింది. దేశ అవసరాల్లో 75 శాతం ఉల్లి ఖరీఫ్ సీజన్ నుంచే వస్తోందని, ఈ సీజన్ కు సంబంధించి పంట మార్కెట్లోకి రావడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని క్రిసిల్ అభిప్రాయపడింది. గత మూడేళ్ల మార్కెట్ గణాంకాలు పరిశీలనలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లిధరలు పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది.