ఆన్ లైన్ షాపింగ్ మరింత సులభతరం
1 min readపల్లెవెలుగువెబ్ : ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం కామన్ గేట్‌వేను అభివృద్ధి చేసింది. ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పేరుతో గతనెలాఖరులో ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్‌లో పైలట్ సేవలను ప్రారంభించింది. వచ్చే 6 నెలల్లో 100 నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్‌లైన్ కొనుగోలుదారులు ఈ ఓపెన్ నెట్‌వర్క్ ద్వారా అన్ని పోర్టళ్ల నుంచి షాపింగ్ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు, విక్రేతలకూ ప్రయోజనకరమే. ఎందుకంటే, వర్తకులు ప్రస్తుతం తమ ఉత్పత్తులను ప్రతి ఈ-కామర్స్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడంతోపాటు ప్రతి పోర్టల్ ద్వారా విక్రయానికి విడివిడిగా డిజిటల్ మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. కామన్ గేట్‌వే ద్వారా విక్రేతలకు సైతం ప్రయాస తప్పనుంది. ప్రధానంగా గల్లీ స్థాయి కిరాణా షాపులు కూడా ఆన్‌లైన్‌లో విక్రయాలు జరిపేందుకు ఓఎన్‌డీసీ దోహదపడనుంది. అన్ని స్థాయిల విక్రేతలతోపాటు అన్ని వర్గాల కొనుగోలుదారులకూ ఆన్‌లైన్‌లో సమాన అవకాశాలు కల్పించడమే ఈ వేదిక ప్రధానోద్దేశం.