కొండాపూర్ లో మిల్లెట్ ఎక్స్ ప్రెస్ ఔట్‌లెట్ ప్రారంభం
1 min read– ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ డైరెక్టర్
– మిల్లెట్ ఎక్స్ ప్రెస్ 16వ ఔట్‌లెట్
– ఈ యేడాదిలో మరో 20 ఔట్‌లెట్లు ప్రారంభించే యోచన
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : మిల్లెట్ ఆహారాన్ని చౌకగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మిల్లెట్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమైంది. మెనూలో 110 కంటే ఎక్కువ చిరుధాన్యాల వంటకాలతో, సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ, తన లక్ష్యాన్ని చేరుకుంటోంది. న్యూట్రిహబ్ (ఐఐఎంఆర్) డైరెక్టర్, సీఈఓ డాక్టర్ దయాకర్ రావు కొండాపూర్ లో మిల్లెట్ ఎక్స్‌ప్రెస్ 16వ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించే అత్యంత ప్రియమైన ఆహార బ్రాండ్ కావాలనే దృష్టితో మిల్లెట్ ఎక్స్‌ప్రెస్ 2019లో ప్రారంభమైంది. ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ దయాకర్‌రావు మాట్లాడుతూ, “చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో పీచు పదార్థాలు (ఫైబర్), మాంసకృత్తులు (ప్రోటీన్), ఇనుము (ఐరన్) పుష్కలంగా ఉంటాయి. రోజువారీ భోజనంలో బియ్యం బదులు చిరుధాన్యాలు తీసుకుంటే మధుమేహం పూర్తి నియంత్రణలో ఉంటుంది. న్యూట్రిహబ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలో మిల్లెట్ ఎక్స్ ప్రెస్ ఒక భాగం. చిరుధాన్యాల విషయంలో ఈ బ్రాండ్ సృష్టించిన అవగాహన పట్ల మేం గర్విస్తున్నాము. న్యూట్రిహబ్ లో ఇలాంటి స్టార్టప్ లకు ఇంక్యుబేషన్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నాం. ఇలాంటి మరిన్ని స్టార్టప్ లను ప్రోత్సహించి న్యూట్రిహబ్ కింద ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వారిని ఆహ్వానిస్తున్నాం. మిల్లెట్ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థాపకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే వీరికి మద్దతు ఇవ్వడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము” అని చెప్పారు.ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు వెంకటేష్, వెంకన్న బాబు, పవన్ కుమార్ మాట్లాదుతూ, “ఆరోగ్యకరమైన ఆహారం అంటేనే అంత రుచిగా ఉండదని సాధారణంగా అనుకుంటారు. రుచికరమైన వంటకాలతో ఈ అపోహను దూరం చేయాలన్నదే మా లక్ష్యం. ఇక్కడ దక్షిణ భారత వంటకాల నుంచి ఉత్తర భారత వంటకాల వరకు అన్నీ ఉన్నాయి. వీటిలో మల్టీ గ్రెయిన్ ఇడ్లీ, రోటీ, మిల్లెట్ పూరీ, కిచిడీలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఒక కిలో వరి ఉత్పత్తికి సుమారు 2200 లీటర్ల నీరు అవసరం. చిరుధాన్యాలకు అందులో సగం కంటే తక్కువ సరిపోతాయి. చిరుధాన్యాలకు మారడం ఆరోగ్యకరమైన నిర్ణయం మాత్రమే కాదు, మన భూగర్భ జలమట్టాలను రక్షించడానికి మంచి ఎంపిక. మేం ప్యాకేజింగుకు బయోడీగ్రేడబుల్ ఉత్పత్తులే వాడుతున్నాం. భారత ప్రభుత్వ సూచన మేరకు ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మొత్తం చిరుధాన్యాల్లో కేవలం 1% మాత్రమే ఎగుమతి చేస్తున్నా, భారతదేశం చిరుధాన్యాల ఎగుమతిలో అగ్రస్థానంలో ఉంది. మేడ్ ఇన్ ఇండియా అనే సూపర్ ఫుడ్‌ను ఇప్పుడు మనమే ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. దయాకర్ రావు గారు ఇక్కడికి వచ్చి మా ఔట్‌లెట్‌ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఐఐఎంఆర్ కు చెందిన న్యూట్రిహబ్ నుంచి మాకు ఎంతో మద్దతు లభించింది,” అని తెలిపారు.