400 మంది విద్యార్థులకు అవకాశాలు
1 min read– టి-హబ్ ఏడో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు
– టైర్-2, టైర్-3 కళాశాలల్లో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లు
పల్లెవెలుగు, వెబ్ హైదరాబాద్ : టి-హబ్ ఏడో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్టూమాగ్జ్ తో కలిసి ఒక ఇంటర్న్ షిప్ మేళా నిర్వహించింది. దాదాపు 74 స్టార్టప్ కంపెనీలు ఇంటర్న్ లను తీసుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు తెలిపారు. ‘‘నగరంలోని వివిధ కళాశాలల నుంచి 2000 మంది హాజరు కాగా, వారిలో 400 మందిని ఈ కంపెనీలు ఇంటర్న్ షిప్ కోసం తీసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ టి-హబ్ నుంచి మొదలైన స్టార్టప్ కంపెనీలే. ఒకవైపు రెసిషన్ వస్తుండటంతో ఉద్యోగాలు దొరకవేమోనని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. కానీ, డిగ్రీ చదవడం ఇంకా పూర్తికాకముందే సంపాదన సాధ్యమన్న విషయాన్ని నిరూపించడమే ఈ ఇంటర్న్ షిప్ మేళా ప్రధాన ఉద్దేశం. ఇందులో డిగ్రీ, ఇంజినీరింగ్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుంచే వీరందరినీ తీసుకున్నారు. వీరంతా టైర్-2, టైర్-3 కళాశాలల నుంచే వచ్చారు. ఈ కళాశాలలకు పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్ సెలక్షన్ల కోసం వెళ్లవు. కానీ, ముందుగానే వారికి ఇంటర్న్ షిప్ అవకాశం ఇవ్వడం ద్వారా, వారందరినీ భవిష్యత్తులో పెద్ద ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు ఈ అవకాశం ఉపయోగపడింది,’’ అని శ్రీచరణ్ లక్కరాజు వివరించారు. “ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల, స్టార్టప్‌లు ప్రతిభావంతులని గుర్తించగలుగుతాయి. ఇంటర్న్‌లకి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అలానే, వారు నిజ జీవిత పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో తెలుసుకుంటారు. స్టూమాగ్జ్ తో భాగస్వామ్యం నెరపడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే మొదటి సారి,” అని టి-హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస రావు తెలిపారు.