ఆస్తిపన్నును.. వ్యతిరేకించండి..
1 min read– ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పల్లెవెలుగు వెబ్ , విజయవాడ: పెంచిన ఆస్తిపన్ను, యూజర్ చార్జీలకు వ్యతిరేకంగా ఈనెల 5వ తేదీలోపు తమ అభ్యంతరాలు తెలియజేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విజయవాడ తూర్పు శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం ఉదయం పెంచిన ఆస్తిపన్ను, యూజర్ చార్జీలకు వ్యతిరేకంగా 13వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాలనీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ గతంలో ఆస్తిపన్నులోనే అన్ని పన్నులు కలిగి ఉండేవని, ప్రస్తుతం ఆస్తిపన్ను భారీగా పెంచడమే కాకుండా యూజర్ ఛార్జీల పేరుతో చెత్త , డ్రైనేజీ , నీటి, లైట్ పన్నుల పేరుతో పన్నులు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వడం దారుణమన్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా గానీ, ప్రభుత్వ అనిశ్చిత నిర్ణయాల వల్ల గాని నగరంలో ప్రజలు పనులు లేక వ్యాపారాలు లేక సతమతమవుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు గద్దె ప్రసాద్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, కాలనీ పెద్దలు రామారావు, పూర్ణచంద్రరావు, శివాజీ, నాగేశ్వరరావు, వేములపల్లి శ్రీనివాస్,కొర్రపాటి శ్రీను, శివ, సాయి లక్ష్మి, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.