నగర పంచాయతీ కమిషనర్లపై చర్యలకు ఆదేశం..!
1 min read– మున్సిపల్ శాఖను ఆదేశించిన లోకాయుక్త
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో అనధికార లే-అవుట్లపై చర్యలు తీసుకొని ఫలితం 2011 నుండి విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికను కూడా పట్టించుకోని ఉయ్యూరు నగరపంచాయతీ అధికారులు కృష్ణాజిల్లా, ఉయ్యూరు నగరపంచాయతీలో 7 కోట్ల 19 లక్షల 59 వేల 5 వందల రూపాయల వసూలుకు సంబంధించిన విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నివేదికపై, ది. ఏప్రిల్ 23వ తేదీ2012 నుండి ఇప్పటివరకు పనిచేసిన ఉయ్యూరు నగరపంచాయతీ కమీషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే చర్యలు తీసుకోలేదని భావించిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఇప్పటివరకు పనిచేసిన 21 మంది నగరపంచాయతీ కమీషనర్లు, 12 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. కృష్ణాజిల్లా, ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికపై ఉయ్యూరు నగరపంచాయతీ అధికారులు చర్యలు తీసుకో వటంలేదని ది. ఫిబ్రవరి 7వ తేదీ 2020న రాష్ట్ర లోకాయుక్త కు ఫిర్యాదు చేయటం జరిగింది. విజిలెన్స్ నివేదికను కూడా అమలు చేయని ఉయ్యూరు నగరపంచాయతీ అధికారుల పనితీరుపై రాష్ట్ర లోకాయుక్త, ‘లోకాయుక్త కార్యాలయం ఇనవెస్టిగేషన్ డిప్యూటీ డైరక్టర్ను విచారణ చేయవల్సిందిగా ఆదేశించారు. ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ డైరక్టర్ పి. రాజకుమార్ 2005వ సంవత్సరం నుండి ఉయ్యూరు నగరపంచాయతీలోని 30 అనధికార లేఅవుట్లపై సవివరమైన నివేదికను గౌ॥ లోకాయుక్త కు సమర్పించడం జరిగింది. ఉయ్యూరు నగరపంచాయతీ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఅవుట్ల ద్వారా చెందాల్సిన నిధులు జమ కాకపోవటాన్ని తన నివేదికలో పేర్కొన్నారు. 21మంది మున్సిపల్ కమీషనర్లు, 12 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర లోకాయుక్త రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.