మా అమ్మాయిని అప్పగించాలంటూ.. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
1 min read– యువతి ఆచూకి కోసం.. ప్రయత్నిస్తున్నామంటున్న ఎస్ఐ
పల్లెవెలుగు వెబ్, రుద్రవరం: గత నెల 27న అదృశ్యమైన తమ కూతురును ఇప్పటి వరకు అప్పగించలేదని, ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మండలంలోని ఆర్. నాగులపురం గ్రామస్తులు. సోమవారం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాల సుబ్బయ్య, నరసింహ, మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బాల సుబ్బయ్య కూతురు గత నెల 27న అదృశ్యం కావడంతో 28వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ కుళ్లాయప్ప నేటికీ అమ్మాయిని అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు.. రేపు.. అంటూ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే న్యాయం చేయాలని కోరారు.
యువతి ఆచూకి కోసం.. ప్రయత్నిస్తున్నాం : ఎస్ఐ
ఈ విషయమై ఎస్ఐ కుళ్లాయప్పను ప్రశ్నించగా యువతి ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నాం. ఆళ్లగడ్డకు చెందిన అబ్బాయితో అమ్మాయి వెళ్లినట్లు తెలిసింది. వారు మేజర్లు కావడంతో హైదరాబాద్ ఆర్య సమాజం సంస్థ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు పంపారు. వాటిని తల్లిదండ్రులకు, కుటుంబీకులకు పంపాము. వారిని స్టేషన్కు పిలిపించేలా చర్యలు తీసుకుంటున్నాం.