ప్రపంచంలోనే సర్వ మతాల సమ్మేళనం మన భారతదేశం
1 min readక్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రపంచంలోనే భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు ఏకైక నిలయం మన భారతదేశం అని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని బుధవారం పేటలో ఉన్న చర్చిలో క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పావని, ఉషారాణి ,మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్రైస్తవ పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం తనకు ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భిన్న మతాలు, భిన్న సంస్కృతులు మన దేశంలో ఉన్నాయని, మనదేశంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, జైనులు ఇలా అన్ని మతాలవారు కలగలిపి జీవనం సాగించడం అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పారు. ఎవరు ఏ మతంలో ఉన్నప్పటికీ ఇతరుల మతాన్ని గౌరవించడం నేర్చుకోవాలనీ చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో మతపిచ్చితో మతకల్లోలాలు చెలరేగి మారణకాండ జరుగుతుందని ఇది ఎంత మాత్రం సహించరాని విషయమని చెప్పారు. ఎవరు ఏ మతంలో ఉన్నా ఇతరుల మతాన్ని గౌరవించాలన్న విషయాన్ని విస్మరించరాదు అన్నారు. క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగ తో పాటు నూతన సంవత్సరం వరకు పండగ వాతావరణం లో జీవిస్తారని అందుకే వారికి చీరలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించే సమయంలో మన దేశాన్ని సెక్యులర్ దేశంగా ప్రకటించారని , దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆయన తెలిపారు. మానవత్వం, దయాగుణం కలిగి ఉండాలన్న ఏసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ పాటించి సమాజ హితానికి పాటుపడాలని కోరారు. ప్రపంచ మానవాళి పాపాలను కడగడానికి ఏసు ప్రభువు ఈ లోకానికి వచ్చారని , వారి మనస్సుకు శాంతి కలగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని, అప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.