డిసెంబర్ 10న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ జయప్రదం చేయండి
1 min readడిసెంబర్ 10న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి మహాసభను జయప్రదం చేయండి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఐక్యతతోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చు.
మహాసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు.
కర్నూలు నుండి వేలాదిగా మహాసభకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తరలిరావాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పోస్టర్ ఆవిష్కరణ మరియు సన్నాహక సమావేశం లో అమరావతి జేఏసీ కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు పిలుపు. కర్నూల్ ( రెవెన్యూ భవన్ ):- ఏపీ జెఎసి అమరావతి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ విజయవాడలో డిసెంబర్ 10వ తేదీన ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధమ మహాసభ జయప్రదం చేయాలని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు పిలుపునిచ్చారు. ఈమెరకు ఆదివారం కర్నూలు కలెక్టరేట్లోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్లో మహాసభ విజయవంతం చేయుటలో భాగంగా పోస్టర్ ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు మాట్లాడుతూ ఏపీజేఏసీ అమరావతికి అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఏకం చేసి అసోసియేషన్ను సమస్తాగతంగా బలపరుచుటలో భాగంగా కొత్త జిల్లాలతో కలిపి 26 జిల్లాల్లో అసోసియేషన్ జిల్లా శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. డిసెంబర్ 10వ తేదీన జిల్లా కమిటీలకు అనుబంధంగా రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుందన్నారు.డిసెంబర్ 10వ తేదీన విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగే మహాసభ వేదికపై రాష్ట్ర కమిటీ ఆవిర్భావంతో పాటు కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధులు ఆహ్వానించి వారి ద్వారా రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించే విధంగా ఇప్పటికే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని, ఇతర పెద్దలను మహాసభకు ఆహ్వానించినట్లు తెలిపారు. మహాసభ విజయవంతం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతను తెలిపేందుకు వేలాదిమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మహాసభకు తరలిరావాలని సురేష్ బాబు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేటు ఏజెన్సీల భారీ నుండి కాపాడి ఆప్కాస్ ఏర్పాటు చేయడం ఉద్యోగులకు కాసంత ఊరట కలిగించిన విషయమేనని కానీ ఉద్యోగులకు కనీస వేతనం లేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతూ కుటుంబాలను భారంగా నెట్టుకొని వస్తున్నారని తెలుపుతూ ప్రభుత్వం చిరుద్యోగుల బాధలు ఆలకించి శ్రమకు తగ్గ వేతనం ఇచ్చి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని గుర్తించాలన్నారు.కర్నూలు జిల్లా ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ గిరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలకంగా ఉంటూ చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. వేతనాలు చాలా తక్కువ అయినప్పటికీ వారికి కేటాయించిన పనిని సకాలంలో పూర్తి చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు.ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపి వారిని కూడా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. చిరుఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం చాలా దారుణమని కనీసం నాలుగవ తరగతి ఉద్యోగుల కైనా ప్రభుత్వ పథకాలు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీజేఏసీ అమరావతి ఎల్లప్పుడూ చిరుఉద్యోగుల పక్షాన నిలబడి వారికి రావలసిన హక్కులను పొందే క్రమంలో ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో వారికి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. మహాసభ విజయవంతం చేయుటలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుతో పాటు కర్నూలు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి జనరల్ సెక్రెటరీ కే వై కృష్ణ, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షులు డి దాసన్న, ప్రధాన కార్యదర్శి ఎస్కే మస్తాన్ పెద్ద ఎత్తున వివిధ శాఖల ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు.